Fri Mar 06 2026 14:53:11 GMT+0530 (India Standard Time)
Chandrababu : చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారయిందా?
బీహార్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కు విస్తరిస్తాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి

బీహార్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కు విస్తరిస్తాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బీహార్ లో నితీష్ కుమార్ ను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుని అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబోతున్నారు. అదే సీన్ ఏపీలో కూడా రిపీట్ అవుతుందా? అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. ముఖ్యమంత్రిగా నారా లోకేశ్ ను పదవిలో కూర్చోబెట్టి, చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళతారని గత కొంతకాలంగా ఊహాగానాలు అయితే జోరుగా నడుస్తున్నాయి. గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ ఖండించడం లేదు.అలాగని సమర్థించడమూ లేదు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంగీకారంతోనే లోకేశ్ ను ఏపీ ముఖ్యమంత్రిగా చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
బీహార్ కు, ఏపీకి వ్యత్యాసమిదే...
అయితే బీహార్ కు, ఆంధ్రప్రదేశ్ కు చాలా వ్యత్యాసం ఉంది. బీహార్ రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యం ఉంది. కానీ ఏపీ రాజకీయాల్లో టీడీపీ పెత్తనం ఉంది. కూటమిలోనూ టీడీపీ 134 స్థానాలుండగా, బీజేపీకి కేవలం పది శాసనసభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ శాసించే పరిస్థితుల్లో లేదు.కేవలం సహకరించే స్థితిలోనే అది ఉందని చెప్పాలి. నాయకత్వం మార్పు అనేది పూర్తిగా చంద్రబాబు ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలంటే అందుకు బీజేపీ కూడా అంగీకరిస్తుందనే భావించాలి. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ బీజేపీ బలంగా లేదు. కేంద్రంలో చంద్రబాబుకు కీలక పదవి ఇచ్చినంత మాత్రాన కమలం పార్టీకి వచ్చే నష్టమేమీ ఉండదు.
కేంద్రంలో కీలకమైన పదవి...
బీహార్ లో అలా కాదు. అక్కడ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. జేడీయూ తక్కువ స్థానాల్లో విజయం సాధించింది. అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నితీష్ కుమార్ ను పదో సారి ముఖ్యమంత్రిగా చేసింది.కానీ తర్వాత నితీష్ కుమార్ కు కూడా పుత్ర వాత్సల్యంతోటి కేంద్రంలోకి రావడానికి అంగీకరించారంటారు.నితీష్ కుమార్ కుమారుడికి బీహార్ ఉపముఖ్యమంత్రి పదవి దక్కనుంది. ఇక ఏపీలోనూ చంద్రబాబు పుత్ర వాత్సల్యంతోనే త్వరలోనే నిర్ణయం తీసుకుంటారంటారు. ఎనభై వసంతాలకు చేరువలో ఉన్న చంద్రబాబు కేంద్రంలో కీలకమైన పదవి చేపట్టాలని యోచిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఎప్పుడు అనేది చెప్పలేం కానీ..జరగదు అని చెప్పలేని పరిస్థితులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయని చెప్పకతప్పదు. మరి పవన్ సహకారం అందితే వీలయినంత త్వరగానే చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు.
Next Story

