Fri Dec 05 2025 12:23:15 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మంత్రి వర్గ విస్తరణకు వేళయిందా? ఏపీ టీడీపీలో హాట్ టాపిక్
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణకు సమయం దగ్గరపడినట్లుంది.

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణకు సమయం దగ్గరపడినట్లుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు గడిచింది. అంటే మరో ఆరు నెలలు గడిస్తే రెండేళ్లు పూర్తవుతుంది. అయితే మంత్రి వర్గ విస్తరణ ఖచ్చితంగా ఉంటుందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో అందరూ కొత్త వారే కావడంతో పాటు విపక్షానికి సరైన కౌంటర్ ఇవ్వడంలోనూ విఫలమవుతున్నారు. కొందరి మంత్రుల్లో సబ్జెక్ట్ పై అవగాహన కూడా లేదు. అనేక వివాదాలు ఈ పదహారు నెలల్లోనే చుట్టుముట్టాయి. చంద్రబాబు నాయుడు అంతా తాను ఒక్కడే అయి వ్యవహరించాల్సి వస్తుంది. జిల్లాలో కూటమి నేతల మధ్య తలెత్తిన విభేదాలను కూడా పరిష్కరించలేని పరిస్థితుల్లో ఉన్నారన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు.
పాజిటివ్ వేవ్స్ ఉన్నప్పటికీ...
ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి పాజిటివ్ వేవ్స్ ఉన్నాయని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుండటంతో పాటు పెట్టుబడులు కూడా వస్తుండటంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. నిధుల కొరత ఉన్నా ఏ మాత్రం చెప్పింది చెప్పినట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయినా మంత్రులు దానిని పెద్దగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారన్న అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు. జిల్లాలను పర్యటించడంతో పాటు అక్కడ కూటమి నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంలోనూ మంత్రులు వైఫల్యం చెందుతున్నారన్న బలమైన అభిప్రాయం చంద్రబాబులో ఏర్పడింది. అందుకే వచ్చే ఏడాదిలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే వార్నింగ్ లు...
ఇప్పటికే మంత్రి వర్గ సమావేశాల్లో పలుమార్లు చంద్రబాబు నాయుడు మంత్రులను హెచ్చరించారు. అయినా కొందరిలో మార్పు రాకపోవడాన్ని గమనించారు. మంత్రులకు ఫైళ్ల క్లియరెన్స్ లోనూ, పనితీరులోనూ మార్కులు కూడా ఇచ్చారు. కానీ మంత్రుల్లో మార్పు కనిపించకపోవడంతో ఇక సమయం చాలని, ఎన్నికల టీంను సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు సిద్ధమయినట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక పోస్టు ఖాళీగా ఉంది. జనసేనకు చెందిన ముగ్గురు మంత్రులున్నారు. బీజేపీకి చెందని ఒక మంత్రి ఉన్నారు. వాటితో సంబంధం లేకుండా మంత్రివర్గంలో పెద్దయెత్తున ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సారి మాత్రం ఎన్నికల టీం కావడంతో సీనియర్లకు అవకాశం కల్పించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంత ఆందోళన బయలుదేరింది. ఎవరు ఉంటారో.. ఎవరికి ఊస్టింగ్ అనేది అన్న చర్చ జరుగుతుంది. ఇన్ -అవుట్ లపై కూడా పార్టీలో పెద్దయెత్తున ప్రచారం అయితే ఉంది.
Next Story

