Fri Dec 05 2025 20:25:30 GMT+0000 (Coordinated Universal Time)
Butta Renuka : బుట్టా ఎఫెక్ట్... వైసీపీకి దెబ్బేనా?
మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకను ఎమ్మిగనూరు ఇన్ ఛార్జి నుంచి తప్పించి వైసీపీ నాయకత్వం పెద్ద తప్పు చేసిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకను ఎమ్మిగనూరు ఇన్ ఛార్జి నుంచి తప్పించి వైసీపీ నాయకత్వం పెద్ద తప్పు చేసిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అక్కడ ఆమెను కొనసాగించకుండా కర్నూలు పార్లమెంటు ఇన్ ఛార్జిగా నియమించడంతో బుట్టా రేణుక సామాజికవర్గం ఫ్యాన్ పార్టీకి రివర్స్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. 2014లో వైసీపీ నుంచి బుట్టా రేణుక కర్నూలు పార్లమెంటు సభ్యురాలిగా గెలిచారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆమె పార్టీ మారారు. టీడీపీలోకి వెళ్లినా ఆమెకు సరైన ప్రాధాన్యత లభించకపోవడంతో తిరిగి వైసీపీ చెంతకు చేరారు. మొన్నటి ఎన్నికల్లో బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్ ను జగన్ ఇచ్చారు.
ఓటమి పాలు కావడంతో..
అయితే మొన్నటి కూటమి గాలిలో బుట్టా రేణుక కూడా ఓటమి పాలయ్యారు. అయితే ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లాలో ఎక్కువగా బుట్టా రేణుక సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎమ్మిగనూరు నుంచి వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేయాలని బుట్టా రేణుక అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా మారుతుందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే తాను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కావచ్చని బుట్టా రేణుక నిన్న మొన్నటి వరకూ భావించారు. కానీ ఒక్కసారిగా పార్టీ నాయకత్వం ఆమెను అక్కడి నుంచి తప్పించి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించడంతో ఆమె నిరాశకు గురయ్యారు.
ఎమ్మిగనూరులో రెండు వర్గాలకు...
ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి వర్గానికి, బుట్టా రేణుకకు మధ్య గ్యాప్ పెరగడంతోనే వైసీపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ సామాజికవర్గం కోణంలో అది పార్టీకి ఇబ్బంది తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ ఛార్జిగా చెన్నకేశరెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డిని నియమించడం పట్ల కూడా రేణుక వర్గంలో అసంతృప్తి తలెత్తిందంటున్నారు. ఇద్దరినీ చెరోచోటికి పంపామని, అంతా సెట్ అయినట్లేనని పార్టీ నాయకత్వం భావిస్తున్నా భవిష్యత్ లో మాత్రం రాజకీయంగా ఇబ్బందులేనన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. మరి వైసీపీ నాయకత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కర్నూలు జిల్లాపై కూడా పడే అవకాశం లేకపోలేదంటున్నారు. బీసీలకు అన్యాయం జరిగిందన్న భావన వ్యక్తమవుతుంది. బుట్టారేణుక ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నప్పటికీ ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

