Tue Jan 20 2026 18:30:00 GMT+0000 (Coordinated Universal Time)
వంటనూనెల ధరలకు బ్రేక్ వేసిన ఏపీ సర్కార్
ఏపీలో ఇటీవల వంట నూనెల ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. వాటికి బ్రేక్ వేస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది.

అమరావతి : రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపించి.. వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచేశారు. ఫలితంగా వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతోంది. ఏపీలో ఇటీవల వంట నూనెల ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. వాటికి బ్రేక్ వేస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. సన్ ఫ్లవర్, పామాయిల్, వేరుశెనగ నూనెలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే వాటి ధరల నియంత్రణకై మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతు బజార్లలో కొన్ని కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. మొబైల్ వాహనాల ద్వారా ఆయిల్ విక్రయాలు చేపట్టనున్నారు.
రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతి రోజు సమావేశమై వంట నూనెల ధరలను సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజా ఆదేశాలతో వంటనూనెల అధిక ధరలకు బ్రేక్ పడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు కూడా చౌకధరల దుకాణాల్లో వంటనూనెలను కొనుగోలు చేయాలని సూచించింది. ఇకపై వంటనూనెలను అక్రమంగా నిల్వ చేసే వారిపై కేసులు నమోదు చేసి, వారి వద్దనున్న స్టాకును స్వాధీనం చేసుకుని తక్కువ ధరలకు విక్రయించనుంది ప్రభుత్వం. అలాగే ప్రభుత్వ అధికారులు.. హోల్ సేల్ డీలర్లు, మిల్లర్లు, రిఫైనరీదారులు కేంద్రప్రభుత్వ వెబ్ పోర్టల్‌కు లోబడి స్టాక్ పరిమితిని పాటిస్తున్నారో లేదో తనిఖీలు చేయనున్నారు.
Next Story

