Fri Jan 23 2026 11:47:46 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన డిమాండ్ ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే ఆసక్తికరమైన రాజకీయచర్చలు మొదలవుతున్నాయి. కూటమి వచ్చే ఎన్నికల్లో కొనసాగుతుందా? అటే 90 శాతం కొనసాగుతుందని అందరూ చెబుతున్న మాట. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈసారి మాత్రం బీజేపీ, జనసేనఒక్కటిగా మారి టీడీపీకి సీట్ల పొత్తుల విషయంలో కొంత ఒత్తిడి తెచ్చే అవకాశముందని అంటున్నారు. పవన్ కల్యాణ్, బీజేపీ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పై సైలెంట్ వ్యవహరిస్తుండటాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు. ఈసారి నియోజకవర్గాల సంఖ్య పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో తమ వాటా సంఖ్య కూడా పెంచాలని బీజేపీ, జనసేన కోరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
టచ్ మి నాట్ గా...
జగన్ చేసే విమర్శలకు బీజేపీ నేతల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు.అలాగే జనసేన నేతలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. జగన్ ప్రభుత్వంపై చేసే విమర్శలకు టీడీపీ నేతలే సమాధానమివ్వాల్సి వస్తుంది. మిత్ర పక్షాలు జగన్ చేసే విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్న ఆ రెండు పార్టీలు తమ శాఖకు సంబంధించిన వాటిపై వచ్చిన విమర్శలకు మాత్రమే సమాధానమిస్తున్నారు తప్పించి అంతకు మించి టచ్ మి నాట్ గా వ్యవహరించడం కూడా ఈ చర్చకు దారి తీస్తుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగానే, ఆయన అంకెలకు రెండు పార్టీల నేతలు ఓకే చెప్పారు.
మూడు పార్టీల మధ్య...
అందుకే 2024 ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సీట్ల పంపకంలో పెద్దగా విభేదాలు తలెత్తలేదు. కానీ 2029 ఎన్నికలకు మాత్రం పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. సహజంగా బీజేపీ,జనసేనల్లోనూ ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే అధికారంలో ఉన్నటీడీపీ నేతలకు, నియోజకవర్గాల్ల్లో జనసేన, బీజేపీ నేతలకు మధ్య సరైన అవగాహన లేకపోగా అనేక అంశాల్లో విభేదాలు బయటపడుతున్నాయి. దాదాపు 175 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తాము కూటమిలో ఉన్నామని మర్చిపోయి తమకు టీడీపీ నేతలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన, బీజేపీ నియోజకవర్గ స్థాయి నేతలు బాహాటంగానే చెబుతున్నారు. అందుకే ఆరెండు పార్టీలు నేతలకు న్యాయం చేయాలంటే కొన్ని సీట్లు ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు ఆ రెండు పార్టీలను ఎలా ఒప్పిస్తారన్నది చూడాలి.
Next Story

