Thu Jan 22 2026 09:52:49 GMT+0000 (Coordinated Universal Time)
Bandla Ganesh : మూడేళ్ల తర్వాత కాని మూడ్ రాలేదా సామీ?
ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ పాదయాత్ర నిజంగా ఎందుకు చేస్తున్నారు

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ పాదయాత్ర నిజంగా ఎందుకు చేస్తున్నారు. నిర్మాతగా ఉన్న బండ్ల గణేశ్ చంద్రబాబు కోసమే పాదయాత్ర చేస్తున్నారా? లేదా మరేదైనా కారణమా? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడును గత వైసీపీ ప్రభుత్వ హాయంలో యాభై మూడు రోజుల పాటు స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో జైలులో ఉంచారు. అయితే చంద్రబాబు ప్రాణాలతో బయటపడాలని బండ్ల గణేశ్ మొక్కుకున్నారట. చంద్రబాబును జైల్లో పెట్టింది? ఎప్పుడు ఎప్పుడు విడుదలయ్యారు? మూడేళ్ల తర్వాత కాని బండ్ల గణేశ్ కు పాదయాత్రకు మూడ్ రాలేదా? అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజంగా అదే కారణమయితే చంద్రబాబు విడుదలయిన వెంటనే బండ్ల గణేశ్ పాదయాత్ర చేపట్టి ఉంటే నమ్మేవారమని అంటున్నారు.
టీడీపీ కార్యకర్తలే నమ్మని విధంగా...
బండ్ల గణేశ్ పాదయాత్రను టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. బండ్ల గణేశ్ పక్కా వ్యాపారి. చంద్రబాబుకు, ఇక్కడ రేవంత్ రెడ్డికి సత్సంబంధాలున్నాయి. బండ్ల గణేశ్ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా గత ఎన్నికల సమయంలోనూ పనిచేశారు. అయితే రేవంత్ రెడ్డి బండ్ల గణేశ్ ను గుర్తించడం లేదా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. తెలుగు సినీ నిర్మాతగా, కమెడియన్ గా బండ్ల గణేశ్ అందరికీ సుపరిచితుడే.ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణలో ఉన్న తన వ్యాపారాలను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు వయా రేవంత్ రెడ్డి వైపు వచ్చేలా ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్న కామెంట్స్ బలంగా వినిపడుతున్నాయి.
అటు నుంచి నరుక్కు రావాలనా?
2018 నుంచి బండ్ల గణేశ్ రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, ప్రమాణస్వీకారినకి ఒకరోజు ముందు ఎల్బీ స్టేడియం వద్దకు వెళతానని చెప్పి కూడా సంచలనం సృష్టించారు. అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా పార్టీ నేతలు బండ్ల గణేశ్ వైపు చూడటం లేదు. తనను ఇక్కడ ఎవరూ పట్టించుకోరని భావించిన బండ్ల గణేశ్ చివరకకు తాను అటు నుంచి నరుక్కు రావాలంటూ కొత్త డ్రామాకు తెరతీశారంటున్నారు. చంద్రబాబు మీద ప్రేమతో తాను పాదయాత్ర చేస్తున్నానని నమ్మించి గరుడపురాణం శివాజీని పక్కనపెట్టుకుని పాదయాత్ర ప్రారంభించినప్పుడే ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయని నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఆరోగ్యం కోసం సొంత పార్టీ నేతలే చేయని సాహసాన్ని బండ్ల గణేశ్ చేయడాన్ని అభినందించాలని మరికొందరు కోరుతున్నారు.
Next Story

