Sat Jan 17 2026 10:44:10 GMT+0000 (Coordinated Universal Time)
Avanthi Srinivas : వెయిటింగ్ లోనే అవంతి.. బెర్త్ దొరుకుతుందన్న ఆశ ఫలించేనా?
విశాఖకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎక్కడ ఉన్నారన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు

విశాఖకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎక్కడ ఉన్నారన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం తన వ్యాపారాలను చూసుకుంటున్నారని మాత్రం చెబుతున్నారు. రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లోకి వేగంగా దూసుకు వచ్చి పార్లమెంటు సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అయిన అవంతి శ్రీనివాస్ అంతే స్పీడ్ తో రాజకీయాల నుంచి బ్రేక్ ఇవ్వడంపై చర్చ జరుగుతంది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతం రాజకీయంగా ఖాళీగానే ఉన్నారు. ఆయన తన విద్యాసంస్థలను చూసుకోవడానికే పరిమితయ్యారు. అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా ఏ పార్టీలో చేరలేదు.
పార్టీలో చేర్చుకుంటే...
ఆయన పార్టీలో చేరాలనుకున్నప్పటికీ ఇప్పటికే విశాఖ ప్రాంతంలో అధికార పార్టీలో నేతలు ఎక్కువ కావడంతో పాటు ఆయనను చేర్చుకుంటే లేనిపోని తలనొప్పులు వస్తాయని భావించి ఏ పార్టీ కూడా ఆయనను దరిచేరనివ్వకపోవడంతోనే సమయం కోసం వెయిట్ చేస్తున్నారంటున్నారు. ఆర్థికంగా, సామాజికవర్గ పరంగా బలమైన నేతగా ఉన్న అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరాలనుకున్నప్పటికీ అక్కడ ఎంట్రీ దొరకలేదు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లడంతో ఆయనను చేర్చుకోవడంపై స్థానిక టీడీపీ నాయకత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అందుకే అవంతి శ్రీనివాస్ ఇప్పుడు మన టైం బాగాలేదని భావించి రాజకీయాలకు దూరంగా ఉన్నారంటున్నారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా?
విశాఖ కార్పొరేటర్ గా ఉన్న తన కుమార్తె ను కూడా వైసీపీ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం సందర్భంగా రాజీనామా చేయించారు. అయినా సరే అవంతి శ్రీనివాస్ ను మాత్రం ఎవరూ నమ్మడం లేదు. ఆయన మళ్లీ తమ పార్టీలోకి వస్తే రాజకీయంగా ఇబ్బందులే తప్ప అనవసరమన్న అభిప్రాయానికి వచ్చినట్లుంది.. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరేందుకు ప్రయత్నించారట. అయితే అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలిసింది. అవంతి శ్రీనివాస్ చేరికకు విశాఖ జనసేన నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా అభ్యంతరం తెలిపారు. దీంతో ఆయన చేరికకు రెడ్ సిగ్నల్ పడటంతో ఇక అవంతి శ్రీనివాస్ ఖాళీగానే కూర్చున్నారు. సమయం వచ్చినప్పుడు వారే పిలుస్తారులే అన్న ధీమాతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకపోయినా మళ్లీ పార్లమెంటు సభ్యుడిగానైనా పోటీకి అవకాశం దక్కుతుందని ఆయన భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?
Next Story

