Tue Mar 10 2026 14:12:35 GMT+0530 (India Standard Time)
Avanigadda : బుద్ధప్రసాద్ కే కోపం తెప్పించారుగా.. అవనిగడ్డలో టీడీపీ vs జనసేన డిష్యూం.. డిష్యూం
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎప్పుడూ కూల్ గా ఉంటారు

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎప్పుడూ కూల్ గా ఉంటారు. అలాంటి మండలి బుద్ధప్రసాద్ కే ఆగ్రహం తెప్పించారు. అవనిగడ్డలో జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కు అక్కడి టీడీపీ నేతలకు గతకొంతకాలంగా పొసగడం లేదు. నియోజకవర్గంలో టీడీపీని లేకుండా మండలి బుద్ధ ప్రసాద్ చేస్తున్నారంటూ గతలో టీడీపీ నేతలు ఆరోపించారు. అదే సమయంలో అవనిగడ్డలో జనసేన, టీడీపీ కీచులాటలు ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో మిత్రపక్షాలుగా కలిసి నడవాల్సిన నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవనగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ టీడీపీ నేతలు పోస్టులు పెడుతున్నారు.
ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు...
తాజాగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రివిలేజ్ కమిటీకి మండలి బుద్ధప్రసాద్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. కోడూరు గ్రామంలో2 లక్షల రూపాయల వ్యయంతో యన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజల కోసం రోడ్డు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే, కాంట్రాక్టరును బెదిరించి మిషన్ పంపివేసి, మంత్రులు, నాయకులు తనను శంకుస్దాపన చేయమన్నారని చెప్పి మరో మిషన్ తీసుకువచ్చి ఎటువంటి అధికార పదవి లేని బండే శ్రీనివాసరావు అనే వ్యక్తి శంకుస్థాపన చేయడం శాసనసభ్యుని హక్కలను భంగపరచడం, అవమానించడంగా భావించి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నానంటూ మండలి బుద్ధ ప్రసాద్ ప్రకటించారు.
గతంలోనూ సమావేశాన్ని ఏర్పాటు చేసి...
శాసనసభ్యుని విధి నిర్వహణలో తలదూర్చకుండా, శాసనసభ్యుని గౌరవ మర్యాదలు ప్రివిలేజ్ కమిటి కాపాడుతుందని భావిస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. కాగా బండే శ్రీనివాసరావు కోడూరు మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేను ఎదరించేందుకు నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. గతంలోనూ కోడూరు మండల తెలుగుదేశ పార్టీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేసేందుకు మండలి ప్రయత్నిస్తున్నారని, దీనిని తాము అడ్డుకుంటామని ప్రకటించారు. తాజా ఘటనలతో అవనిగడ్డలో టీడీపీ వర్సెస్ జనసేనగా మారింది. ఇప్పటికైనా అవనిగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ, జనసేన నాయకత్వం ఫోకస్ పెట్టి నేతల మధ్య సమన్వయం కుదర్చాలని పలువురు కూటమి అభిమానులు కోరుకుంటున్నారు.
Next Story

