Thu Jan 29 2026 16:31:27 GMT+0000 (Coordinated Universal Time)
YS Sharmila : కంటతడి పెట్టుకున్న వైఎస్ షర్మిల
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల వివాదంపై ఆమె స్పందించారు.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల వివాదంపై ఆమె స్పందించారు. తల్లి విజయమ్మ జగన్ చేసిన పనికి మానసిక వేదనతో కుమిలిపోతున్నారని తెలిపారు. కన్న తల్లిని న్యాయస్థానానికి లాగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని షర్మిల ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆంధ్రరత్న భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె కంటతడి పెట్టారు. సుబ్బారెడ్డి జగన్ మోచేతి కింద నీళ్లు తాగే వ్యక్తిగా అభిర్ణించారు. జగన్ పాలనలో ఆయనతో పాటు కుమారుడు లాభపడ్డారన్న వైఎస్ షర్మిల సాయిరెడ్డి కూడా తనకు వ్యతిరేకంగానే మాట్లాడతారని తెలిపారు. సుబ్బారెడ్డి బిడ్డలపై ప్రమాణం చేసి నిజం చెప్పాలని వైఎస్ షర్మిల కోరారు.
అవి జగన్ ఆస్తులు కాదు...
సంస్థలకు వారి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన అవి జగన్ ఆస్తులు ఎలా అవుతాయని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తన పేర్లు ఉంటే షర్మిలపై కేసులు నమోదు చేయాలి కదా? అని సుబ్బారెడ్డి అంటున్నారని, అయితే భారతిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదన్నారు. తనకు బహుమతి ఇచ్చేటట్లయితే ఎంవోయూ ఎవరైనా ముందు రాసుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఆ వ్యాపారాలన్నీ తండ్రి వైఎస్ స్థాపించినవేనని వైఎస్ షర్మిల కుండ బద్దలు కొట్టారు. తాను ఎన్నికల్లో జగన్ కోసం ఎన్ని కష్టాలు పడ్డానో అందరికీ తెలుసునని తెలిపారు. 3,200 కిలోమీటర్ల వరకూ పాదయాత్ర కూడా చేసిన విషయాన్ని వైఎస్ షర్మిల గుర్తు చేశారు.
జగన్ మనస్తత్వమే...
జగన్ మనస్తత్వమే ఎదుటి వారిని అణగదొక్కడమేనని అన్న షర్మిల గత పదేళ్లలో ఎన్ని కష్టాలు పడినా ఎంవోయులు బయటపెట్టలేదని, వాటిని వాడుకోలేదని వైఎస్ షర్మిల తెలిపారు. తనకు రాజకీయంగా లాభం వస్తుందని భావిస్తే జగన్ ఎవరినైనా తన కోసం వాడుకుంటారని, అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తారని వైఎస్ షర్మిల అన్నారు. జగన్ చేసిన మోసాన్ని వైసీపీ కార్యకర్తలు గుర్తించాలని అన్నారు. జగన్ బెయిల్ రద్దు కోసం తాము కోర్టులో కేసు వేశామని చెబుతున్నారని, జగన్ నాయకుడు కాదని శాడిస్ట్ అని అన్నారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి విద్యుత్తు ఛార్జీలను పెంచుతుందన్నారు.
Next Story

