Mon Dec 09 2024 09:39:34 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : వైఎస్ జగన్ పై షర్మిల సెటైర్లు విన్నారా?
వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విద్యుత్తు ఒప్పందాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు
వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విద్యుత్తు ఒప్పందాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో ట్వీట్ చేశారు. 2021, మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే, జగన్ రూ 2.49 పైసలకు కొన్నందుకు సన్మానాలు చేయాలా? అంటూ ఎద్దేవా చేశారు. అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొంటే.. అదే కంపెనీ నుంచి 50పైసలు ఎక్కువ పెట్టి, రూ.2.49 పైసలకు కొన్నందుకు మీకు శాలువాలు కప్పలా? అని ప్రశ్నించారు. అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా ? అంటూ ఎకసెక్కాలు చేశారు.
అదానీని కలిస్తే...
ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే ..గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రూ.2.49 రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు ? ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్ఠంగా యూనిట్ రూ.1.70 పైసలు పడతాయని..జగన్ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా ? అని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా ? అని షర్మిల నిలదీశారు. దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజమే.. అదానీతో ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర అని, అదానీ కలవడం ఒక చరిత్ర అని, రూ.1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం చరిత్రఅంటూ సెటైర్లు వేశారు.
Next Story