Thu Jan 29 2026 01:09:49 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : చంద్రబాబు నాయుడుకు షర్మిల ప్రత్యేక వినతి ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రాత్మకమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా, గడిచిన వారంరోజుల్లో, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి, అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు డా వైఎస్ రాజశేఖర రెడ్డిగారి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు మమ్మల్ని ఎంతగానో కలచివేశాయని తెలిపారు.
ప్రతీకార దాడులు...
వారు చేసారని మీరు, మీరు చేసారని భవిష్యతులో మళ్ళీ వాళ్ళు, ఇలా ఈ పగలకు, ప్రతీకారాలు అంతు ఉండదని అభిప్రాయపడ్డారు. సభ్యసమాజంలో, ప్రజాస్వామ్యంలో వీటికి చోటు లేదని, ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా, నిబద్ధతతో జరగాల్సిన ఈ సమయంలో, ఇటువంటి హేయమైన చర్యలు, దాడులు, శాంతిభద్రతలకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రగతికి, పేరుకు, అందివచ్చే అవకాశాలకు కూడా తీవ్రమైన విఘాతం కలగజేస్తాయని షర్మిల తెలిపారు. గడచిన ఐదేండ్లలో జరిగిన విశృంఖల పాలన, దానివలన అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలోపెట్టి ముందుకు తీసుకునివెళతారని ప్రజలు మీకు ఈ తీర్పు ఇచ్చారని, దానికి అనుగుణంగా నడుచుకుని, వైఎస్సార్ విగ్రహాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రతీకార రాజకీయాలు వద్దని కోరారు.
Next Story

