Sun Jan 25 2026 04:09:55 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఉగాది నాటికి గృహప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పేదల కోసం చేపడుతున్న ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.ఈ మేరకు ఇవాళ గృహనిర్మాణశాఖ అధికారులతో నిర్వహించిన మంత్రి కొలుసు పార్ధసారధి ఈ మేరకు టార్గెట్ పెట్టేశారు. దీంతో పేదలకు ఈసారి కచ్చితంగా ఇళ్ల పంపిణీ ఖాయంగా కనిపిస్తోంది.రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. రానున్న ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి వాటి ప్రారంభోత్సవానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు టార్గెట్ ఇచ్చారు.
పేదవాడికి పక్కా ఇల్లు...
ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు నిర్మించాలని, ఆ లేఔట్ లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నాణ్యతతో కూడిన ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఉగాది నాటికి పూర్తి చేయడానికి రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలని, ప్రతిరోజు అధికారులు తనిఖీ చేసి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని మంత్రి కోరారు.అలాగే హౌసింగ్ బోర్డు ద్వారా పూర్తి చేసుకున్న ఇళ్లలో తక్షణం లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి పార్థసారథి ఆదేశించారు.
ఇప్పటికే పూర్తయిన కాలనీలలో ...
ఇప్పటికే పూర్తయిన కాలనీలలో లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికను వెంటనే తయారు చేయాలని, ఇతర ప్రభుత్వ శాఖలు పంచాయతీరాజ్, పురపాలక, పబ్లిక్ హెల్త్ విభాగాలతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు చేపడదామని తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణాల బాధ్యత తీసుకున్న అధికారులు, నిర్మాణాలు పూర్తి ఆయన ఇళ్లలోనికి లబ్ధిదారులు చేరేవరకూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఉగాది నాటికి అంటే ఈ ఏడాది మార్చి నాటికి పేదల సొంత ఇళ్ల కల సాకారమయ్యే అవకాశాలున్నాయి.
Next Story

