Mon Feb 02 2026 08:35:52 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయో? పారిశ్రామికవేత్తలు వస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా తయారయ్యాయి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా తయారయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభిజిత ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. రాజకీయాలు అన్నాక విమర్శలు సహజం. అధికార పార్టీపై విపక్షాలు విమర్శలు రాజకీయ కోణంలోనే చూడాలి. అయితే ఆ విమర్శలు శృతి మించకూడదని కూడా నేతలు తెలుసుకోవాలి. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినా.. పలు మార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలోనూ ఇలాంటి దాడులను ప్రోత్సహించలేదు. అలాగే ఇంతటి కక్షలు, కార్పణ్యాలు వ్యక్తిగతంగా కంటే ఎక్కువ రాజకీయ కోణంలోనే ఉండేవి. కేసులు కూడా ఎక్కువగా నమోదయ్యేవి కావు.
గత ఏడేళ్ల నుంచి...
గత ఏడేళ్ల నుంచి ఏపీ రాజకీయాలు టర్న్ తీసుకున్నాయి. నాడు అధికార పక్షంలో ఉన్న వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపదాడి జరిగింది. అప్పుడు మొదలయిన రాజకీయ మంటలు నేటికీ కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్ధించరు. దాని వల్ల ఆ పార్టీకే చెడ్డపేరు వస్తుంది. అలాగని కర్రలను, రాళ్లను చేతితో పట్టుకుని అంబటి ఇంటిపై దాడులు చేయడం కూడా టీడీపీ నేతల తప్పు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన నేతల తప్పిదమని చెప్పాలి. దీంతో అంబటి చేసిన వ్యాఖ్యలు మారుమూలన పడిపోయి ఆయన ఇంటిపై జరిగిన దాడి హైలెట్ కావడం అది అధికార పార్టీకే ఎక్కువ నష్టం చేకూరుస్తుందని చెప్పవచ్చు.
జోగి రమేష్ ఇంటిపై...
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి కూడా చాల హేయమైన చర్య. జోగి రమేష్ నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప ఆయన ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేయడం కూడా టీడీపీకి నష్టం చేకూర్చే అంశమే. టీడీపీ, వైసీపీల మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణం కేవలం ఆ రెండు పార్టీలకు మాత్రమే కాదు.. పరిశ్రమల పెట్టుబడులపై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఏపీ అంటేనే పారిశ్రామికవేత్తలు భయపడి పోయే అవకాశముంది. అందుకే టీడీపీ, వైసీపీ నేతలు సంయమనం పాటించాలి. రెచ్చగొట్టే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, వ్యాఖ్యలు చేయడం మానుకుని రాష్ట్ర పురోగతికి పాటుపడాలని కోరుతున్నారు.
Next Story

