Thu Mar 26 2026 14:53:21 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : వైసీపీని కూటమి సర్కార్ ఇలా దెబ్బకొట్టనుందా? బలమైన నేతల నియోజకవర్గాలు గల్లంతేlనా?
నియోజకవర్గాల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీలకే లాభం చేకూరుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి

నియోజకవర్గాల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీలకే లాభం చేకూరుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఐదు సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. కానీ నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరిగినప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చాయన్నది వాస్తవం. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందిందన్న విషయాన్ని కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
నాడు కాంగ్రెస్ చేసిన పనిని...
2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో చీలిక తెచ్చినియోజకవర్గాలను విభజించి మరొక దానిలో కలిపినప్పుడు ఆటోమేటిక్ గా అపోజిషన్ లో ఉన్న పార్టీకి రాజకీయంగా నష్టం జరిగింది. తెలుగుదేశంపార్టీ అనేక సార్లు గెలిచిన నియోజకవర్గాలను నాడు రద్దు చేయడంతో పాటు రిజర్వ్ డ్ స్థానాలుగా మార్చడంతో నాడు టీడీపీ అధికారంలోకి రాలేకపోయిందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. కొన్ని మండలాలను కూడా అటు ఇటు మార్చేసిన సందర్భాలున్నాయి. టీడీపీని నియోజకవర్గాల్లో బలహీనపర్చారన్న విమర్శలు వినిపించాయి. మార్టూరు, ప్రత్తిపాడు, నందిగామ,కొవ్వూరు, చింతలపూడిలను ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గాలుగా మార్చారు.
వైసీపీ బలమైన నియోజవర్గాలపై...
అయితే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు వైసీపీకి బలంగా ఉన్న నియోజకవర్గాలను రిజర్వ్ డ్ గా మార్చే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు వైసీపీ బలహీనమవుతుంది. వైసీపీ బలమైన నేతలున్న నియోజకవర్గాలు రిజర్వ్ డ్ స్థానాలుగామారే ఛాన్స్ ఉంది. నాడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని నేడు వైసీపీని దెబ్బకొట్టేందుకు కూటమి సర్కార్ ప్రయత్నించదన్న గ్యారంటీ ఏమీలేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ స్థానాలతో పాటు వైసీపీకి పట్టున్న బలమైన నియోజకవర్గాలు ఈసారి మారి దానిని బలహీనపర్చేందుకు కూడా అవకాశాలున్నాయి. అయితే 2009లో నియోజకవర్గాల పెంపు లేదు. ఉన్న నియోజకవర్గాల్లోనే రిజర్వేషన్లను మార్చారు. అయితే ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండటం ఎవరికి లాభమన్నది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది.
Next Story

