Tue Mar 31 2026 18:34:43 GMT+0530 (India Standard Time)
ఎన్నికల మూడ్ లోకి వెళ్లిన జగన్
జగన్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్లే కనపడుతుంది. ఎన్నడూ లేనిది ఈరోజు జగన్ ప్రసంగం ఎన్నికల ప్రచారాన్ని తలపించింది

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్లే కనపడుతుంది. మూడేళ్లలో ఎన్నడూ లేనిది ఈరోజు జగన్ ప్రసంగం గత ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. మహిళ దినోత్సవం సందర్భంగా జగన్ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ ఒకే వేదికపైకి రప్పించారు. దేశంలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంటు చట్టాలు కొన్నేళ్లుగా చేస్తూనే ఉందన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం 51 శాతం పదవులు, నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లోనూ ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇందుకోసం చట్టం తెచ్చామని చెప్పారు.
రెండు చేతులు పైకెత్తి ఇలా... ఇలా....
రాష్ట్రంలో ఏడు జిల్లాలకు జడ్పీ ఛైర్ పర్సన్ లుగా మహిళలనే నియమించామని చెప్పారు. పొదుపు సంఘాలకు 12 వేల కోట్లు చెల్లించామని చెప్పారు. 102 మార్కెట్ కమిటీలకు మహిళలనే ఛైర్మన్ లుగా నియమించామని చెప్పారు. దేశ చరిత్రలోనే ఇంతమంది ప్రజాప్రతినిధులున్న రాష్ట్రం మనదేనని జగన్ తెలిపారు. వాలంటీర్ల ఉద్యోగాల్లోనూ 53 శాతం మంది మహిళకు అవకాశమిచ్చామని చెప్పారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన కింద తల్లుల ఖాతాల్లోనే నగదును జమ చేస్తున్నామని చెప్పారు. జగన్ ప్రసంగంలో రెండు చేతులు పైకి ఎత్తి ఇలా.. ఇలా.. ఇలా.. అని అంటుండటం ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో మహిళ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్మన్లు, పంచాయతీ సర్పంచ్ లు హాజరయ్యారు.
Next Story

