Mon Mar 16 2026 06:54:38 GMT+0530 (India Standard Time)
Cyclone Alert : మరో వాయుగుండం.. ఏపీ ప్రజలారా హై అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ కు మరో అల్పపీడనం పొంచి ఉంది. ఇది వాయుగుండంగా మరి తుపాను గా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్ కు మరో అల్పపీడనం పొంచి ఉంది. రేపు దక్షిణ అండమాన్ పై ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఈ నెల 23వ తేదీన అల్పపీడనంగా మారే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తనం పశ్చి మ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఈ నెల 23న అల్పపీడనంగా మారే అవకాశముందని చెప్పింది. అనంతరం రెండు రోజుల తర్వాత వాయుగుండంగా మారే అవకాశముందని కూడా తెలిపింది.
భారీ వర్షాలు పడతాయని...
ఈ అల్పపీడనం, వాయుగుండంగా మారి తర్వాత తుపాను గా మారనుండటంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా పేర్కొంది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు...
వాయుగుండంగా మారిన తర్వాత మత్స్య కారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. తుపానుగా మారితే చేపల వేటకు వెళ్లిన వారు తిరిగి సురక్షితంగా ఒడ్డుకు చేరాలని సూచించింది. అదే సమయంలో పొలాల్లో చెట్ల కింద ఉండకుండా పిడుగుల నుంచి కాపాడుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తుపానుగా మారిన తర్వాత ఈ నెల 26 లేకుంటే 27వ తేదీ నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా కదలనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Next Story

