Sun Apr 27 2025 04:18:23 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ శాసనసభ సమావేశాలకు, సీఎం జగన్ విదేశీ పర్యటనకు లింక్ ఇదే.!
సెప్టెంబర్ మూడో వారంలో ఏపీ శాసనసభ సమావేశాలు. ఏపీ శాసనసభ సమావేశాలకు, సీఎం జగన్ విదేశీ పర్యటనకు లింక్ ఇదే

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 18 లేదా 20వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ రెండో వారంలో ఈ సమావేశాలను జరపాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్తున్నారు. సీఎం విదేశాల నుంచి తిరిగివచ్చాక మంత్రివర్గ సమావేశం నిర్వహించి అందులో శాసనసభ సమావేశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ మొదటి వారంలో లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. వైఎస్ జగన్ వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకూ యూకే టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా లండన్లో చదువుకుంటున్న కుమార్తె వద్దకు కూడా వెళ్లబోతున్నారు. విదేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి. యూకే పర్యటనకు వెళ్లడం కోసం నాంపల్లిలోని సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్ళరాదని బెయిల్ షరతులు ఉండడంతో వాటిని సడలించాలని జగన్ పిటిషన్లో కోరారు. జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు కోసం సీబీఐ కొంత సమయం కోరింది. దీంతో తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 30కి వాయిదా వేసింది.
Next Story