Fri Feb 14 2025 19:08:23 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : ఇద్దరిలో ఎవరిది పై చేయి.. ఏపీలో హాట్ టాపిక్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పడు మారుతుంటాయి. ఒక ఏడాది ఉన్న తీరుగా మరొక ఏడాది ఉండే అవకాశం లేదు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పడు మారుతుంటాయి. ఒక ఏడాది ఉన్న తీరుగా మరొక ఏడాది ఉండే అవకాశం లేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఏడాది సమయంలోనే అనేక విషయాలు రాజకీయంగా చోటు చేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవిని లోకేష్ కు ఇవ్వాలంటూ డిమాండ్ పెద్ద సౌండ్ పార్టీ నేతల నుంచి వినిపించడం, దానిని చంద్రబాబు స్వయంగా ఆఫ్ చేయడంతో కొంత మేరకు వివాదం సద్దుమణిగిందనే అనుకోవాలి. ఎందుకంటే ఈ నినాదం సద్దుమణగడం తాత్కాలికమేనని అందరికీ తెలుసు. ఎందుకంటే నారా లోకేష్ ను ప్రతి టీడీపీ కార్యకర్త తమ భవిష్యత్ నేతగానే భావిస్తున్నారు. అలాగే ఎప్పటి నుంచో చూస్తున్నారు.
చంద్రబాబు సీఎంగా...
అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం అది జరగదన్నది కూడా పార్టీ నేతలకు తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకే వర్గానికి చెందిన వారికి ఇచ్చే సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడమే. పవన్ కల్యాణ్ కూడా అగ్రకుల సామాజికవర్గమే కావడంతో మరో ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం మరో అగ్రకులానికి ఇచ్చే అవకాశం లేదు. అందుకు చంద్రబాబు సుతారమూ అంగీకరించరు. అందుకే ఆ నినాదాన్ని ఆదిలోనే చంద్రబాబు సమర్థవంతంగా తుంచి వేయగలిగారు. అయితే ఎవరూ కాదనలేని వాస్తవం మాత్రం చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేది లోకేష్ మాత్రమేనని అందరూ ఆ నినాదాన్ని అందుకున్నారన్నది అందరికీ తెలిసిందే.
పవన్ కల్యాణ్ కూడా...
మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో చంద్రబాబు తన కంటే చాలా సీనియర్. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుతో పవన్ కల్యాణ్ తనను తాను పోల్చుకోను కూడా పోల్చుకోరు. అందుకే శాసనసభ సాక్షిగా పవన్ కల్యాణ్ మరో పదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. మరో ఉప ముఖ్యమంత్రి పదవిని వేరొకరికి ఇస్తే తన అభిమానులతో పాటు, సొంత సామాజికవర్గం నుంచి కూడా ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే ఈ విషయంలో మౌనంగా ఉన్న పవన్ కల్యాణ్ చంద్రబాబు చేతనే ఆ నినాదాన్ని తాత్కాలికంగా ఆపగలిగారు.
వయసులో చిన్న వారే...
అయితే ఇద్దరూ వయసులో చిన్న వారే. రాజకీయంగా ఇద్దరికీ భవిష్యత్ ఉంది. రెండు పార్టీలూ ఆంధ్రప్రదేశ్ లో కలసి పోటీ చేయాల్సిన అవసరాన్ని కూడా ఇద్దరూ గుర్తించాల్సి ఉంది. అదే సమయంలో ఇద్దరూ పోటీ పడితే విడిపోయి పడిపోతామని కూడా ఇద్దరికీ తెలియంది కాదు. అందుకే పట్టుబట్టరు. అలాగని పట్టువిడుపులకు పోరు. ఎవరి పంథా వారిదే. ఎవరి ఆలోచనలు వారివే. వీరిద్దరినీ సమతూకంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత చంద్రబాబు చేతుల్లోనే ఉంది. చంద్రబాబు ఎవరి పక్షమో వహించే వీలు లేదు. అయితే ఇది దీర్ఘకాలంగా పనిచేయదని, భవిష్యత్ లో ఈ ఇద్దరి నేతల మధ్య పోటీ తప్పదన్న విశ్లేషణలు సోషల్ మీడియాలో బాగా వినపడుతున్నాయి. జనసేన నేతలు కూడా ఇదేరకమైన పోస్టింగ్ లు నెట్టింట పెడుతున్నారు.
Next Story