Fri Dec 05 2025 13:22:06 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : అరెస్ట్ చేయండి బాబయ్యా.. మీకు పుణ్యం ఉంటది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కక్ష సాధింపులకు కేరాఫ్ అడ్రస్ లుగా మారాయి. టీడీపీ, వైసీపీలు ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కక్ష సాధింపులకు కేరాఫ్ అడ్రస్ లుగా మారాయి. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును యాభై రెండు రోజుల పాటు జైలులో ఉంచారు. స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును నంద్యాల పర్యటనలో ఉండగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో ఉంచారు. నాడు చంద్రబాబు అరెస్ట్ తోనే సానుభూతి పెల్లుబుకింది. ఏడు పదులు దాటిన వయసులో చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు నాడు వ్యతిరేకించారు. దాని పర్యవసానమే గత ఎన్నికల్లో వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమయింది. అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా అక్కరకు రాకుండా పోయాయి.
కామన్ గా మారిపోవడంతో...
ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి కామన్ అయిపోయింది. అదే సమయంలో సానుభూతి మాత్రం పుష్కలంగా ఉంది. గత ప్రభుత్వంలో అనేక కేసులతో జైలుకు వెళ్లిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్రతో పాటు అందరూ మొన్నటి ఎన్నికల్లో గెలుపొందడాన్ని ఎవరూ మరిచిపోలేరు. అవినీతి చేస్తే జైలుకు వెళ్లడం అన్నది ఒకరకంగా కామన్ అయిపోయింది. జైలుకు వెళ్లి వస్తే మాత్రం అవినీతిని పక్కన పెట్టి ప్రజలు సానుభూతితో ఓట్ల వర్షం కురిపించడం మామూలుగా మారిపోయింది. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు. 2019 ఎన్నికల్లోనూ జగన్ లక్ష కోట్ల అవినీతి చేశారంటూ చంద్రబాబు, టీడీపీ పదే పదే ప్రచారం చేసినా గెలుపును ఆపలేకపోయారు.
అరెస్టయిన వైసీపీ నేతలు...
ఇప్పుడు టీడీపీ వంతు వచ్చేసింది. వరసబెట్టి వైసీపీ నేతలు అరెస్టవుతున్నారు. నందిగం సురేష్, పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్థన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిధున్ రెడ్డి ఇలా అందరూ వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు. వీరిపైన కూడా సానుభూతి పొంగిపొరలుతుందని గ్యారంటీగా చెప్పొచ్చు. ఇప్పటికే కక్ష సాధింపు చర్యలతో రాజకీయ కక్షలతో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్న ప్రచారాన్ని వైసీపీ జోరుగా చేస్తుంది. ప్రజలు కూడా ఆ ప్రచారానికి కనెక్ట్ అవుతున్నారు. అంటే జైలుకు వెళ్లిన నేతలపై క్రమంగా జనంలో సానుభూతి పెరుగుతుందని ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా చట్ట తన పని తాను చేసుకుపోతుందన్న కామన్ డైలాగులు ఎన్నికల సమయంలో పనిచేసే అవకాశలుండవన్న విశ్లేషణలు వస్తున్నాయి.
జగన్ అరెస్ట్ కావాలంటూ...
ఇక మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలు కూడా కోరుకుంటున్నదదే. మహా అయితే జైలుకు వెళితే రెండు నుంచి మూడు నెలలకు మించి లోపల ఉండమని, బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా జనంలోకి వెళ్లడానికి ఒక దారి దొరుకుతుందన్న భావన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. నాడు టీడీపీ నేతలు కానీ, నేడు వైసీపీ నేతలు కాని ఎన్ని కేసులుంటే అంత రాజకీయంగా మంచిదన్న వాతావరణం ఏర్పడింది. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ కూడా జైలుకు వెళ్లివచ్చినంత మాత్రాన గెలిచే అవకాశం ఉండదన్న అతి విశ్వాసాన్ని నాడు వైసీపీ, నేడు టీడీపీ ప్రదర్శిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story

