Sat Mar 07 2026 03:42:57 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో.441.63 కోట్ల ఆస్తులు జప్తు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో రూ.441.63 కోట్ల విలువైన చర, స్థిర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో రూ.441.63 కోట్ల విలువైన చర, స్థిర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థలు, బూనేటి చాణక్య, వాసుదేవ రెడ్డి బంధువులు, ఇతర వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (ప్రకారం స్వాధీనం చేసుకుంది. జప్తు చేసిన ఆస్తుల్లో బ్యాంకు నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు, ఇతర స్థిరాస్తులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర సీఐడీ నమోదు చేసిన కేసును ఆధారంగా చేసుకుని ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మద్యం విధానంలో అవకతవకల వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.4,000 కోట్ల నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పారదర్శకలో లోపం...
2019కి ముందు రాష్ట్రంలో మద్యం వ్యాపారం పారదర్శకంగా, సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవస్థ ద్వారా నడిచేది. కొనుగోలు నుంచి విక్రయాల వరకు ప్రతి దశను డిజిటల్‌గా నమోదు చేసేవారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రిటైల్ మద్యం దుకాణాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించింది. ఈ సమయంలో ఆటోమేటెడ్ వ్యవస్థను నిలిపివేసి మాన్యువల్ విధానాన్ని అమలు చేసినట్టు దర్యాప్తులో బయటపడిందని పేర్కొంది. దీంతో సరఫరా ఆర్డర్లు జారీ చేసే విషయంలో అధికారులకు విస్తృత స్వేచ్ఛ లభించిందని ఈడీ తెలిపింది.
ఎంపిక చేసిన బ్రాండ్లనే...
మాన్యువల్ విధానాన్ని ఉపయోగించి మార్కెట్లో ఉన్న కొన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లను పక్కన పెట్టారని దర్యాప్తులో తేలింది. అదే సమయంలో కొందరు ఇష్టమైన బ్రాండ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చి సరఫరా ఆర్డర్లు మంజూరు చేసినట్టు వెల్లడైంది. అదే పేర్లతో పోలి ఉండే కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టి వాటి ధరలను కృత్రిమంగా పెంచారని ఈడీ పేర్కొంది. దీంతో డిస్టిలరీలకు అధిక లాభాలు వచ్చి అవి లంచాల రూపంలో తిరిగి సిండికేట్ సభ్యులకు చేరినట్టు వెల్లడయింది.సరఫరా ఆర్డర్లు పొందేందుకు డిస్టిలరీలు ఒక్కో కేసు ధరలో 15 నుంచి 20 శాతం వరకు కిక్‌బ్యాక్‌లు చెల్లించాల్సి వచ్చిందని దర్యాప్తులో తేలింది. చెల్లించేందుకు నిరాకరించిన తయారీదారులపై ఒత్తిడి తెచ్చి చెల్లింపులు నిలిపివేయడం, ఆర్డర్లు తిరస్కరించడం వంటి చర్యలు తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని దాచేందుకు ఎన్క్రిప్టెడ్ వాయిస్ కాల్స్, సిగ్నల్ వంటి యాప్‌లను ఉపయోగించినట్టు ఈడీ తెలిపింది. ఇందులో బూనేటి చాణక్య , ముప్పిడి అవినాష్ అలియాస్ సుమిత్, మహ్మద్ సైఫ్ వంటి వారు కీలక పాత్ర పోషించినట్టు పేర్కొంది.
3,500 కోట్ల కుంభకోణం...
కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని సిండికేట్ రాష్ట్రంలో మద్యం కొనుగోలు–పంపిణీ వ్యవస్థను ప్రభావితం చేసి బహుకోట్ల కుంభకోణం నిర్వహించినట్టు ఈడీ పేర్కొంది. APSBCL కొనుగోలు ప్రక్రియలో జోక్యం చేసి రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.3,500 కోట్ల నష్టం కలిగించినట్టు దర్యాప్తులో తేలింది. సిండికేట్ సభ్యులు కిక్‌బ్యాక్‌ల రూపంలో సుమారు రూ.3,500 కోట్ల వరకు వసూలు చేసినట్టు గుర్తించింది.కొన్ని డిస్టిలరీలను నియంత్రణలోకి తీసుకుని వాటి ద్వారా అక్రమ ఆదాయం సృష్టించినట్టు ఈడీ తెలిపింది. అదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, లీలా డిస్టిలరీలు, యూ.వి. డిస్టిలరీలు వంటి సంస్థలకు అధిక వ్యాపారం కల్పించినట్టు పేర్కొంది. మద్యం రవాణా టెండర్‌ను సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించి గతంతో పోలిస్తే ఎక్కువ ధరలు చెల్లించినట్టు కూడా వెల్లడించింది. ఆ కాంట్రాక్టు ఆదాయంలో కొంత భాగాన్ని ఇతర సంస్థల ద్వారా మనీలాండరింగ్ చేసినట్టు గుర్తించింది.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టి...
కొన్ని డిస్టిలరీలు ముడిసరుకు, ప్యాకేజింగ్ సరఫరా పేరుతో కల్పిత కంపెనీలను ఉపయోగించి నిధులను నగదుగా మార్చినట్టు ఈడీ తెలిపింది. ఈ అక్రమ నిధులను భూములు కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టడం వంటి మార్గాల్లో పెట్టుబడిగా మార్చినట్టు వెల్లడించింది. ఇందుకోసం ఈశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఈడి ఎంటర్టైన్మెంట్, యూని కార్పొరేట్ సొల్యూషన్స్, ట్యాగ్ డెవలపర్స్ వంటి సంస్థలను వినియోగించినట్టు తెలిపింది.కొనుగోలు, సరఫరా విధానాలను ప్రభావితం చేసి సిండికేట్ నెలకు సుమారు రూ.100 కోట్ల వరకు అక్రమ ఆదాయం పొందినట్టు దర్యాప్తులో తేలింది. ఈ నగదు కిక్‌బ్యాక్‌లను హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల్లో నిల్వ ఉంచినట్టు కూడా గుర్తించింది.ఇప్పటివరకు దర్యాప్తులో రూ.1,048.45 కోట్ల మనీ ట్రైల్ గుర్తించినట్టు ఈడీ వెల్లడించింది. ఇందులో నగదు, బంగారం రూపంలో చెల్లించిన కిక్ బ్యాక్ లు, డిస్టిలరీల నియంత్రణ, మద్యం రవాణా ద్వారా వచ్చిన లాభాలు ఉన్నాయి.ఈ అక్రమ ఆదాయంతో ఆస్తులు కొనుగోలు చేసి వ్యక్తిగత లాభాల కోసం వినియోగించినట్టు తేలింది. కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
Next Story

