Wed Dec 24 2025 04:01:12 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం .. ఇక వారికి సంక్షేమ పథకాలకు నో ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారకు. సంక్షేమపథకాలను అందించాలంటే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారిని గుర్తించేందుకు ఈ సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడుతుందని భావిస్తుంది. కొందరు అనర్హులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న అనుమానంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చాలా మందికి సంక్షేమ పథకాలు అందడం లేదన్న విమర్శల నుంచి బయటపడేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుంది.
ప్రత్యేక మొబైల్ యాప్ లో...
సమగ్ర కుటుంబ సర్వేను ప్రత్యేక మొబైల్ యాప్ తో నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఆదాయం, వారి వివరాలను నమోదు చేయనున్నారు. దీంతో అసలైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలను అందించేందుకు వీలవుతుంది. కుటుంబంలో ఎంత మంది నిరుద్యోగులు, మహిళలు ఉన్నారన్నది కూడా ఈ సర్వే ద్వారా వెల్లడి కానుండటంతో మిగిలిపోయిన సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు చేయడానికి వీలవుతుందని భావిస్తుంది. మహిళలకు నెలకు పదిహేను వందలు, నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామన్న హామీలను నెరవేర్చాలంటే ఇటువంటి పథకాలను అమలు చేయడం మంచిదని ప్రభుత్వం భావిస్తుంది.
అనర్హులకు అందకుండా...
దీంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉండి ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారన్న అనుమానం ఉంది. గత ప్రభుత్వ హయాంలో అనేక మంది ఇతర రాష్ట్రాల్లో ఉండి అనేక పథకాలు అందుకున్నట్లు అనేక ఆరోపణలున్నాయి. దీంతో పాటు సమగ్ర సర్వే ద్వారా ఎంత మంది కుటుంబ సభ్యులున్నారు? వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఏ ప్రయోజనాలు అందుతున్నాయన్న దానిపై ప్రభుత్వానికి ఒక క్లారిటీ రానుంది. తద్వారా పథకాల అమలు మరింత సులువుగా మారుతుంది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా, అనర్హుల ఏరివేతకు కూడా ఈ సమగ్ర సర్వే ఉపయోగపడుతుంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి సర్వే చేసిన సంగతి తెలిసిందే.
Next Story

