Fri Dec 05 2025 16:19:01 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : బెజవాడ భూములు లులుకు.. ఇదెక్కడి చిత్రంరా నాయనా?
విజయవాడలో లులు సంస్థకు భూమి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

బెజవాడలో అసలే ప్రభుత్వ స్థలాలు తక్కువ. అతి పెద్ద పల్లెటూరుగా విజయవాడను అంటుంటారు. అలాంటి చోట లూలూ సంస్థకు నగరం నడిబొడ్డున 4.5 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు లీజుకు ప్రభుత్వం ఇవ్వడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. విశాఖపట్నంలో ఇచ్చారంటే ఒక అర్థముంది. అక్కడ అన్ని రకాలుగా స్థలం అందుబాటులో ఉంది. అక్కడ ప్రజల కొనుగోలు శక్తితో పాటు లూలూ వంటి మాల్స్ కొంత నగరానికి శోభ తెస్తాయి. కానీ విజయవాడలో లూలూ సంస్థ ఏర్పాటు చేయడం దేనికన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు లులు సంస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందన్న ఆలోచన లేకుండా అడ్డగోలుగా భూపందేరం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండు నగరాల్లో...
విజయవాడ, విశాఖ పట్నంలో లులు సంస్థకు భూమి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ద్వారా భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్ లో 99 ఏళ్లకు లీజు ప్రతిపదికన 13.74 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని పాత బస్టాండ్ కు చెందిన 4.15 ఎకరాలను లూలు సంస్థకు క కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో లులు మాల్ ఏర్పాటుకు అవసరమైన స్థలం లీజు ప్రాతిపదికన ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే దీనిపై నగరవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతాయో కూడా ప్రభుత్వం నుంచి చెప్పలేని పరిస్థితి.
ఉపాధి అవకాశాలు...
లూలు సంస్థ విజయవాడలో పెట్టుబడులు పెట్టేది 156 కోట్లు మాత్రమే. అదే స్థలం విలువ 4.15 ఎకరాలు దాదాపు మార్కెట్ విలువ ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటుంది. విజయవాడలో అసలే ప్రభుత్వ భూములు తక్కువగా ఉండటం, అదీ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ కు సమీపంలోని ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని అప్పగించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థలం విలువ కన్నా లులు పెట్టే పెట్టుబడి పెట్టే తక్కువగా ఉండటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లేకపోవడం చర్చకు దారి తీస్తున్నాయి. అదే మరేదైనా ఐటీ సంస్థలకో, మరొక పరిశ్రమకు ఇస్తే కనీసం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, 99 ఏళ్లకు లీజుకు ఇవ్వడం ఏంటని నగరవాసులు తీవ్రంగా అభ్యంతరం చెబుతున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం లులు సంస్థపై ఇంత ప్రేమ ఎందుకన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్నాయి. దీనిపై వామపక్ష పార్టీ నేతలు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
Next Story

