Fri Dec 05 2025 17:41:26 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : ఏపీ సర్కార్ విన్నూత్న నిర్ణయాలు.. ఫలిస్తే..చంద్రబాబు కల సాకారమయినట్లే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలన్న ఉద్దేశ్యంతో పరిశ్రమలకు బంపర్ ఆఫర్ ఇస్తుంది. పారిశ్రామికాభివృద్ధి కోసం విన్నూత్న నిర్ణయాలను తీసుకుంటుంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు భూములకు తక్కువ ధరకు ఇచ్చేందుకు కూడా సిద్ధపడింది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తే తలసరి ఆదాయం పెరిగే అవకాశముందని అంచనా వేసి సరికొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం కింద ఎకరా భూమిని కేవలం 99 పైసల నామమాత్రపు లీజు ధరకు కేటాయించనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
టెక్ హబ్ పాలసీ ప్రకారం...
ప్రభుత్వం తెచ్చిన 'టెక్‌హబ్ పాలసీ 4.0' ప్రకారం, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాల్లో భూములు కేటాయించనున్నారు. ఫార్చ్యూన్-500, ఫోర్బ్స్ గ్లోబల్ జాబితాలో ఉన్న పెద్ద ఐటీ సంస్థలు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా పేర్కొనడంతో బడా కంపెనీలను ఆకట్టుకునే ప్రయత్నమని చెప్పక తప్పదు. కంపెనీలు మూడేళ్లలో కనీసం మూడు ఉద్యోగాలు సృష్టించాలన్నది ప్రభుత్వం విధించిన ప్రధాన షరతు. బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ నగరాలతో పోటీపడి, రాష్ట్రాన్ని ఒక ప్రధాన టెక్ హబ్‌గా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భూములు కేటాయించారు. మరికొన్ని ప్రముఖ కంపెనీలు కూడా క్యూ కట్టే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి.
పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా...
ఈ పథకం చూడటానికి పారిశ్రామికవేత్తలకు ఆకర్షణ కోసమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగ శాతం తగ్గించేందుకు ఉపయోగపడుతుందని భావించి కొత్త పాలసీని ప్రకటించారు. భూములు కారు చౌకగా ఇస్తున్నందున భూముల కోసమని కాకుండా, తమ కంపెనీ విస్తరణ కోసమయినా రాష్ట్రానికి వస్తారని కూటమి ప్రభుత్వం ఆశగా ఉంది. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను తేవడంతో ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. మొన్నటి ఎన్నికల సమయంలో అది కూడా ఆయన గెలుపునకు తోడ్పడింది. ఇప్పుడు అదే విధంగా తక్కువ ధరకు భూములిచ్చైనా భారీ పరిశ్రమలను తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. చంద్రబాబు సర్కార్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తే మరొకసారి విజయానికి దగ్గరగా వెళతామన్న నమ్మకంతో పార్టీ నేతలున్నారు.
Next Story

