Mon Feb 16 2026 11:54:36 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. పింఛన్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అర్హులైన పేదలందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వారు పడిగాపులు కాస్తున్నారు. ఆన్ లైన్ లోనూ, ఈ సేవా కేంద్రాల నుంచి, వార్డు, గ్రామ సెక్రటేరియట్ ల నుంచి లక్షల సంఖ్యలో పింఛను కోసం దరఖాస్తులందే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటి వరకూ కొత్త పింఛనును మంజూరు చేయలేదు. వివిధ రకాల వడపోతలను చేసిన తర్వాత చివరకు అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు అందచేస్తామని ప్రకటించడంతో చాలా మంది సుదీర్ఘకాలంగా ఎదురు చూసిన నిరీక్షణ ఫలించే సమయం దగ్గర పడింది.
అర్హులైన వారందరికీ...
శాసనమండలిలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయడంతో కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయింది. అయితే ఎప్పటి నుంచి ఈ కొత్త పింఛన్లు అందిస్తారన్నది క్లారిటీ లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరిలో అర్హులకు పింఛను అందించే కార్యక్రమాన్ని ఒకటి, రెండు నెలల్లో చేపట్టే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వృద్ధులు, వితంతవులకు నెలకు నాలుగు వేలు, దివ్యాంగులకు ఆరు వేలు, మంచానికే పరిమితమయిన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్న నేపథ్యంలో అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశముంది. ఇందుకోసం చాలా మంది చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు.
అనర్హులను తొలగించి...
ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో అనర్హులైన వారిని పింఛన్లకు ఎంపిక చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపి కొన్నింటిని తొలగించింది. కొత్తగా వృద్ధాప్య, వితంతు పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనమండలిలో ప్రకటన చేశారు. 1.40 లక్షల మంది అనర్హులను పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశామని త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. దీంతో నెలకు నాలుగు వేల రూపాయలు అందుకునేందుకు అధిక సంఖ్యలో దరఖాస్తులుచేసుకునే వీలుందని భావించి ఎంత సమయం దరఖాస్తు గడువుగా నిర్ణయిస్తారన్నది త్వరలోనే తేలనుంది.
Next Story

