Tue Dec 09 2025 03:05:28 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : జనంలోకి వెళ్లకపోతేనేం.. అయినా ప్రజా సమస్యల పరిష్కారం ఇలా చేయొచ్చుగా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్లాలంటే కొంత ఇబ్బందులు తప్పవు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్లాలంటే కొంత ఇబ్బందులు తప్పవు. ఆయన ఇతర రాజకీయ నేతలు తరహా కాదు. సినీ హీరో కావడంతో పాటు లక్షలాది మంది అభిమానులు ఉండటంతో పవన్ కల్యాణ్ అంత సులువుగా జనంలోకి వెళ్లలేరు. ఏదైనా బహిరంగ సభలు, రోడ్ షోలకు మాత్రమే పరిమితమవుతారు. పాదయాత్ర వంటివి చేయాలన్నా ఆయనకు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. వాహనంపై ఉన్నప్పటికీ అభిమానులు పోలీసు వలయాన్ని ఛేదించుకుని మరీ వచ్చి రచ్చ చేయడం అనేకసార్లు చూశాం. అభిమానుల తాకిడిని తట్టుకోవడం కూడా పవన్ కల్యాణ్ కు కష్టంగా మారి జనంలోకి రావడం అంటే పవన్ భయపడిపోతున్నారు.
మంత్రిగా బాధ్యతలను చేపట్టి...
పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ప్రత్యేకంగా వినియోగించుకోవడమే కాకుండా, తనకున్న పలుకుబడితో నిధులు తీసుకు రావడంతో గ్రామీణ రహదారులు మాత్రమే కాకుండా గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాల నుంచి రోడ్డు సౌకర్యం లేక అల్లాడుతున్న ఏజెన్సీ ఏరియాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టారు. స్వయంగా గిరిజన ప్రాంతాలను దర్శించి వారితో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకుని మరీ పరిష్కారం చేసే దిశగా పవన్ కల్యాణ్ అడగులు వేస్తున్నారు. ఒక్క గిరిజన ప్రాంతాలకు మాత్రమే నేరుగా పవన్ కల్యాణ్ జనంలోకి వెళుతున్నారు.
పల్లె పండగ పేరుతో...
పంచాయతీలకు నిధులు మంజూరు చేయించి పల్లె పండగ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పంచాయతీ పరిథిలో ఉన్న సమస్యలను సర్పంచ్ తో పాటు గ్రామ కమిటీలు కూర్చుని పరిష్కరించుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతీలకు ప్రభుత్వం చేత నిధులు విడుదల చేయించి విద్యుత్తు బకాయీలతో పాటు, రహదారులు, మంచినీటి సౌకర్యం వంటివి కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. గత వైసీపీ పాలనలో పంచాయతీలను నిర్వీర్యం చేయడంతో సర్పంచ్ లు అప్పుల పాలయ్యారు. దీంతో పవన్ కల్యాణ్ పట్టుబట్టి మరీ చంద్రబాబు నాయుడును ఒప్పించి నిధులను పంచాయతీలకు విడుదల చేయించి పల్లె పండగను నిర్వహించారు.
మరో విన్నూత్న కార్యక్రమం...
తాగాజా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు-మాటామంతీ పేరుతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పవన్ కల్యాణ్ ఈ కార్కక్రమానికి శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేడు శ్రీకాకుళం జిల్లా రావివలస ప్రజలతో పవన్ కల్యాణ్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ఊరు-మాటామంతీ కార్యక్రమం జరగనుంది. టెక్కలిలోని థియేటర్ ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను నివేదించవచ్చు. అక్కడికక్కడే సమస్యలన పరిష్కరించేలా పవన్ కల్యాణ్ ప్లాన్ చేశారు. పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామమని అంటున్నారు.
Next Story

