Fri Dec 05 2025 13:18:13 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ అలకకు కలతా? నలతా? అసలు కారణం ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ కు కూడా దూరంగా ఉన్నారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ కు కూడా దూరంగా ఉన్నారు. కనీసం ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండా పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం దక్షిణ భారత దేశంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మూడు రోజుల పర్యటనకు వెళ్లడమూ రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే పవన్ కల్యాణ్ గత కొద్ది రోజుల నుంచి ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. అయితే ఆయనకు జ్వరంతో పాటు తీవ్రమైన నడుంనొప్పి ఉందని, వైద్యుల సూచనల మేరకు ఆయన హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
మూడు రోజుల పర్యటన...
స్పాండిలైటిస్ తో బాధపడుతూ, జ్వరం బారిన పడిన పవన్ కల్యాణ్ కొద్దిగా తేరుకున్న వెంటనే సనాతన ధర్మయాత్ర పేరిట దేవాలయాల సందర్శనకు వెళ్లారంటే ఎవరూ నమ్మడం లేదు. ఈ నెల 6వ తేదీన పవన్ కల్యాణ్ మంత్రి వర్గ సమావేశానికి హాజరు కాలేదు. అలాగే నిన్న కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశాలకు కూడా దూరంగానే ఉన్నారు. తన శాఖలకు సంబంధించిన విషయాలను కూడా గత కొద్ది రోజుల నుంచి పట్టించుకోవడం లేదు. వాటిన్నింటినీ పక్కన పెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినప్పుడు ఆయన లిఫ్ట్ చేయకపోవడం కూడా రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది. ఇది కేవలం నలత వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదా? లేక కలత చెందారా? అన్నది జనసైనికుల్లోనూ చర్చనీయాంశమైంది.
చంద్రబాబు ఫోన్ చేసినా...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ తో మాట్లాడేందుకు నాదెండ్ల మనోహర్ చేత ప్రయత్నించినప్పటికీ అది కూడా సాధ్యపడలేదు. నాదెండ్ల మనోహర్ ఫోన్ కు కూడా ఆయన స్పందించలేదు. ఏదో తేడా కొట్టినట్లుందని, ఏపీ రాజకీయాల్లో ఏదో కాలిన కమురు వాసన వస్తుందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మూడు రోజుల పాటు ఏకబిగిన తమిళనాడు, కేరళలో పర్యటించడం అంటే మామూలు విషయం కాదు. అన్ని దేవాలయాలకు వెళ్లాలంటే కేవలం విమానాల నుంచి మాత్రమే కాకుండా కొన్ని కిలోమీటర్లు రహదారిపైన కూడా పర్యటించాల్సి ఉంది. పవన్ కల్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్, ఆనంద్ సాయిలు మాత్రమే ఉన్నారు.
కూటమి ప్రభుత్వంలో...
మరొక వైపు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ కల్యాణ్ ప్రథాన కారణం. చంద్రబాబు నాయుడు కూడా పవన్ కు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే కొన్ని విషయాల్లో పవన్ కు చికాకు తెప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. షాడో సీఎంలుగా తయారయి కొన్ని ఫైళ్లను కొందరు నడిపించడాన్ని పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇతర శాఖల మంత్రుల విషయంలో జోక్యం చేసుకోవడమే కాకుండా అధికారులు కూడా కొందరి మాటే వినడం, జనసేన నేతలను పట్టించుకోకపోవడం కూడా ఆయన కలత చెందడానికి కారణంగా తెలుస్తుంది. అందువల్లనే ఆయన జర్క్ ఇవ్వడానకే పవన్ కల్యాణ్ ఈ రకమైన వైఖరిని అవలంబిస్తున్నారా? లేక నిజంగానే సనాతన ధర్మయాత్రలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుకూడదని భావించారా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఏపీ కూటమి ప్రభుత్వంలో ఏదో జరుగుతుందన్న వార్తలు మాత్రం జోరుగా వస్తున్నాయి.
Next Story

