Fri Dec 05 2025 17:52:41 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు నోట ఆ మాట ఎందుకు వచ్చింది?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ సభలో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

ఒక్కోసారి నేతల నుంచి వచ్చే మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. అనుకోకుండా వచ్చినా అవి కొన్నిసార్లు నిజమవుతాయి. అదే సమయంలో తమకంటూ నేతలకు ఒక స్పష్టత ఉంటుంది. అందుకే రాజకీయాల్లో అనుభవం ఉన్న నేతలు ఏం మాట్లాడినా అందులో గూఢార్థాలు దాగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ సభలో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు చేసిన కామెంట్స్ పైనే నేడు పార్టీలోనూ, రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఈ సమాశంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత దగ్గుబాటి, చంద్రబాబు నాయుడు కలసి ఒకే వేదికను పంచుకున్నారు.
దగ్గుబాటి పుస్తకావిష్కరణ సభలో...
తొలుత విశాఖలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు, చంద్రబాబు కు మధ్య వైరం ఉందని అందరూ అనుకుంటారని, అందులో వాస్తవం ఉందని, అలాగని జీవితాంతం వైరంతోనే ఉండాలా? అని ప్రశ్నించారు. ఎల్లకాలం పరుషంగా ఉండాలా? అంటూ ఆయన అన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుని ఆనందంగా ఉన్నానన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇద్దరం కలసి మెలసి ఉండటమే అందరికీ కావాల్సిందన్నారు. తన పుస్తకావిష్కరణకు పిలిచిన వెంటనే చంద్రబాబు రావడం సంతోషంగా ఉందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. తాను కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతున్నానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు.
తనకు ఆ పరిస్థితి వస్తే అంటూ...
దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనను కలసి నప్పుడు తాను ఆయనను అడిగానని, ఎలా టైం పాస్ అవుతుందని తాను అడిగానని అన్నారు. రాజకీయం నుంచి తప్పుకున్న తర్వాత ఎలా కాలం గడుస్తుందని ప్రశ్నించానన్నారు. తనకు కూడా ఆ పరిస్థితి వస్తే ఎలా? అని ఆలోచించి ముందుగా ప్లాన్ చేసుకోవాలని ఆయనను ఈ విషయం అడగాల్సి వచ్చిందని అన్నారు. అయితే అందుకు తాను ఆనందంగా ఉండటానికి చాలా విషయాలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారని, ఇక తనకు కూడా ధైర్యం కలిగిందని అన్నారు.సాధారణంగా రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్నా జనంలో ఉండటమే మేలని, దానికి విశ్రాంతి ఉండదన్న చంద్రబాబు నాయుడు ఏ రాజకీయ నేతకైనా ఎప్పటికైనా రిటైర్ మెంట్ తప్పదని, అదే సమయంలో ప్రజాసేవకు విశ్రాంతి తీసుకోవాల్సిన పనిలేదని అందుకు వెంకయ్యనాయుడు నిదర్శనమని తెలిపారు.
లోకేశ్ కు బాధ్యతలను అప్పగించి...
దీంతో చంద్రబాబు నాయుడు తాను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుని తన కుమారుడికి బాధ్యతలు అప్పగిస్తున్నారా? అన్న చర్చ నాయకుల్లో మొదలయింది. చంద్రబాబు నాయుడు ఏడు పదులు వయసు దాటినా నేటికీ ఉల్లాసంగా ఉంటారు. ఆయన ఫిట్ నెస్ తో మరో దశాబ్దకాలం పాటు రాజకీయం చేసే వీలుంది. అయితే తనయుడికి బాధ్యతలను అప్పగించాలనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారా? లేక అన్యాపదేశంగా ఆయన నోటి నుంచి వచ్చాయా? అన్నది మాత్రం తెలియకున్నా ఇప్పుడు టీడీపీతో పాటు మిగిలిన సోషల్ మీడియాల్లో ఈ మాటలు వైరల్ గా మారాయి. చంద్రబాబు మరో మూడు దశాబ్దాల పాటు పార్టీకి, రాష్ట్రానికి సేవలందించాలని నేతలు కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు ఈ మాట ఎందుకన్నారన్నది మాత్రం పార్టీ నేతల్లో కొంత చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే పార్టీ బాధ్యతలను నారా లోకేశ్ అంతా తానే అయి చూసుకుంటున్నారు. దీంతో కావాలనే అన్నారని కొందరు పోస్టులు పెడుతున్నారు.
Next Story

