Fri Dec 05 2025 14:57:28 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నాయుడు గారి శ్రమ.. ఫలిస్తుందా? భిన్నమైన పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? అంటే చెప్పలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుండటంతో ఆయనపై పెట్టుకున్న నమ్మకాలు మాత్రం నిజం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రచారంలో ఇచ్చిన హామీలలో చాలా వరకూ అమలు చేసినప్పటికీ అభివృద్ధి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వెనకబడి ఉందన్న విషయం చెప్పక తప్పదు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు. అయినా రాష్ట్ర విభజన తర్వాత ఆయన వేస్తున్న అడుగులు ముందుకు పడటం లేదు. దానికి కారణం విడిపోయిన రాష్ట్రం కావచ్చు.
హైదరాబాద్ లో మాత్రం...
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు పెద్దగా కష్టపడాల్సిన పనిలేకపోయింది. అందుకు వాతావరణ పరిస్థితులతో పాటు పారిశ్రామికంగా, వైద్య పరంగా అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్ కావడంతో పాటు నిజాం కాలం నుంచే హైదరాబాద్ ప్రత్యేకతను సంతరించుకోవడంతో చంద్రబాబు నాయుడు ఆలోచనలు, కార్యాచరణ కొంత ముందడుగు పడ్డాయి. హైదరాబాద్ లో పెద్ద కష్టం లేకుండా చంద్రబాబు నాయుడు సైబరాబాద్ ను నిర్మాణం చేశానని ఇప్పటికీ చెప్పుకుంటున్నారంటే అందుకు స్థల మహత్యం కూడా కారణమని చెప్పక తప్పదు. హైదరాబాద్ గత నలభై ఏళ్ల నుంచి పాలకులు ఎవరున్నా డెవలెప్ మెంట్ మాత్రం ఆగలేదు.
రాజధాని లేకపోవడంతో...
ఇక అమరావతికి వచ్చే సరికి పూర్తి భిన్నమైన పరిస్థితి. సరైన రాజధాని లేదు. రాజధాని నిర్మాణం ఇంకా మొదలు కాలేదనే చెప్పాలి. గత ప్రభుత్వం మూడు రాజధానుల నిర్మాణం ప్రతిపాదన ముందుకు తేవడంతో గత పదేళ్ల నుంచి రాజధాని నిర్మాణం సాగడం లేదు. ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. రాజధాని నిర్మాణంలో మొదటి దశ పనులు పూర్తి కావాలంటే దాదాపు మూడేళ్లకు పైగానే సమయం పడుతుంది. ఇప్పటికే ఒక ఏడాది గడిచిపోయింది. మరో మూడేళ్లలో వరుణుడు, ప్రకృతి అనుకూలిస్తే పనులు సజావుగా సాగుతాయి. లేకుంటే మరింత ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే చంద్రబాబు నాయుడు అనుకున్న లక్ష్యానికి ఇంకా దూరంగానే ఉన్నారని చెప్పాలి.
Next Story

