Wed Feb 04 2026 22:33:10 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఎవరేమనుకున్నా.. తగ్గేదే లే.. ముందుకు పోవడమే మార్గం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అనుకున్నదే చేస్తారు. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గరు. అందులో పీ4 పథకం పై ఆయన ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అనుకున్నదే చేస్తారు. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గరు. తనకు అనుకూలమైన మీడియా వ్యతిరేకించినా తాను మాత్రం అనుకున్న దారిలోనే ముందుకు వెళతారు. అందులో పీ4 పథకం పై ఆయన ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఎవరేమనుకున్నా.. ఎవరేం చెప్పినా తన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు. పేదరిక నిర్మూలన అంటే మొత్తం పేదరికం రూపుమాపడం కాదని, కనీసం వాళ్లు తమ కుటుంబాన్ని పోషించుకునే స్థోమతను కల్పించడమే తన ఉద్దేశ్యమని చెప్పకనే చెప్పుకొచ్చారు. ఇందుకోసం వెనక్కు తగ్గబోమని, పేదవాళ్ల కోసం మనసున్న వాళ్లు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పదే పదే పిలుపు నిస్తున్నారు.
పేదల కుటుంబాన్ని...
గత ఉగాదికి పీ4 పథకాన్ని చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి పేదల కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శకులను కూడా ఎంపిక చేసుకుంటూ వెళుతున్నారు. తాను నియోజకవర్గాలను పర్యటించినప్పుడు కనీసం రెండు, మూడు బంగారు కుటుంబాలను గుర్తించే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఈ పథకం కింద దాదాపు పదమూడు లక్షల మంది బంగారు కుటుంబాలను ఎంపిక చేశారు. అలాగే మార్గదర్శకులుగా ఉండేందుకు దాదాపు 1.40 లక్షల మంది ముందుకు రావడం కూడా పథకం విజయవంతమవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. వీరిలో ప్రవాసాంధ్రులతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు.
సంపద సృష్టించడమంటే...
సంపద సృష్టించడమంటే పేదల ఇళ్లల్లో వెలుగు నింపడమేనని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ పథకం వల్ల కొన్ని కుటుంబాలయినా కూడు, గుడ్డ, నివాసానికి ఇబ్బంది లేకుండా ఉండగలిగితే సగం విజయం సాధించినట్లేనని నమ్ముతున్నారు. ఎంతమందికి అవకాశాలు కల్పించామన్నది కాకుండా వారు జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. దీనివల్ల పేదల కుటుంబాల్లో తొలుత మానసికంగా ధైర్యంవస్తుందని, తర్వాత వారు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవడమే కాకుండా పది మందికి ఉపయోగపడేలా తయారవుతారన్నది చంద్రబాబు ఆలోచన. ఈ మేరకు తన సొంత మీడియాలో విమర్శలు వచ్చినా లెక్క చేయడం లేదు. పీ4 పథకం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆయన బలంగా విశ్విస్తున్నారు. మరి ఈ పథకం సక్సెస్ అయితే మాత్రం చంద్రబాబు నాలుగో పర్యాయంలో నూతన పథకంతో జనంలోకి వెళ్లినట్లే అనుకోవాల్సి ఉంటుంది.
News Summary - andhra pradesh chief minister chandrababu naidu will do whatever he wants. he has decided to move forward with the P4 scheme
Next Story
