Sat Dec 06 2025 00:21:18 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : మార్పు మంచిదే కానీ.. నాలుగేళ్లు కొనసాగించడం సాధ్యమయ్యే పనేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆలోచనలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆలోచనలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో మాదిరిగా అభివృద్ధి అజెండాగా ముందుకు వెళ్లడానికి ఆయన కాస్త వెనుకంజ వేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే.. గత మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సాగిన పాలన తీరు ఒకలా ఉంది. నాలుగో సారి మాత్రం లెక్క మారిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తి కావస్తుండటంతో చంద్రబాబు ఇటు కొంత వత్తిడికి గురవుతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం అభివృద్ధి అజెండాగా ముందుకు వెళితే ఫలితాలు ఇబ్బంది పెడతాయని ఆయనకు తెలిసి వచ్చింది. అందుకే ఈ సారి గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు.
కీలకం కావడంతో...
2024 ఎన్నికలు చంద్రబాబు నాయుడుకు కీలకం. అందుకే ఎడాపెడా హామీలను ప్రజల ముందు ఉంచారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు అదనంగా అనేక రాయితీలను ప్రకటిస్తూ ఆయన అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన కారణమయ్యారని చెప్పాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవడంతో పాటు బీజేపీ చేతులు కలపడం వల్ల యాభై శాతం సక్సెస్ కు కారణమయితే.. మిగిలిన యాభై శాతం విజయానికి మాత్రం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే కారణమని చెప్పక తప్పదు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ను ఎక్కడ ప్రజలు తిరిగి ఎన్నుకుంటారోనన్న ఆందోళనతో ఆయన హామీలను మాత్రం ఇబ్బడి ముబ్బడిగానే చేశారని చెప్పాలి.
ఒక్కొక్కటిగా అమలు చేస్తూ...
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడం మామూలు విషయం కాదు. ఆ విషయం తెలిసినా గతంలో మాదిరిగా చివరి ఏడాది హామీలు అమలు చేస్తే ప్రజలు తమను ఆదరించరని భావించిన చంద్రబాబు ఈ సారి మాత్రం ఏడాదిలోపే కొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేస్తున్నారు. ప్రధానంగా ఒక్కసారిగా పింఛను ను నాలుగువేల రూపాయలు పెంచడం ఖజానాపై భారీగా భారం పడింది. అలాగని దానిని ఆపలేదు. అధికారంలోకి వచ్చిన మరుసటి నెలలోనే అమలు చేశారు. ఇక పేదింటి మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా దాదాపు వెనువెంటనే అమలు చేశారు. తర్వాత ఖర్చుతో కూడుకున్న తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేసి తనపై ప్రజల్లో నమ్మకం తగ్గకుండా ఉండేలా ప్రయత్నం చేశారు.
ఆర్థికభారాన్ని అధిగమించడమెలా?
ఇక ఇటీవల అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేశారు. అయితే దీనిపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన వారిలో చాలా మందికి ఈ పథకం వర్తించలేదన్న భావన రైతుల్లో నెలకొంది. దీంతో పాటు నేతన్నలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని కూడా అమలు చేశారు. ఇక మరో వారం రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు కానుంది. ఇన్నిహామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఒక పథకం లాంచ్ చేయడం సులువేనని, దానిని మరో నాలుగేళ్లు కొనసాగించాలంటే ఆదాయం పెరగకుండా కేవలం అప్పులపైనే ఆధారపడి అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఏ ధైర్యంతో పథకాలను అమలు చేస్తున్నారో తెలియదు కానీ.. రానున్న రోజుల్లో ఆర్థిక కష్టాలు తప్పవన్న హెచ్చరికలు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి.
Next Story

