Thu Mar 27 2025 04:13:09 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఎమ్మెల్యేలు ఇక మారాల్సిందేనా? చంద్రబాబు హెచ్చరికలు అలాగే ఉన్నాయిగా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతం కంటే భిన్నంగా కనిపిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతం కంటే భిన్నంగా కనిపిస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పాలన - అభివృద్ధి అంటూ ఒకే పాట పాడేవారు. కానీ 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబులో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేతల కన్నా క్యాడర్ అండగా నిలిచిన విషయాన్ని ఆయన పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల గురించి ప్రస్తావించిన దాఖలాలు లేవు.పథ్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయన పద్దెనిమిది గంటలు శ్రమించినా రాష్ట్రం కోసం పనిచేసేవారంటారు. అంతే తప్ప కార్యకర్తల గురించి క్షణం కూడా ఆలోచించే వారు కాదన్నది అందరి అభిప్రాయం.
గత ఐదేళ్ల కాలంలో...
కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు కావడంతో పాటు తనను కూడా యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచడంతో అప్పుడు కార్యకర్తలు చూపిన తెగువ, సాహసాన్ని చంద్రబాబు మర్చిపోలేకపోతున్నారు. అందుకే ఈసారి గతం కంటే భిన్నంగా కనిపిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడకు వెళ్లినా అక్కడ అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమతయ్యే వారు. ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వీలయినంత త్వరగా రాజధానికి చేరుకునే వారు. నిత్యం అధికారులతో సమీక్షలు చేస్తూ గడిపే వారు. అలాగే తనిఖీల పేరుతో అధికారులను పరుగులు పెట్టించే వారు. వార్నింగ్ లు ఇచ్చేవారు.
టీడీపీ కార్యకర్తలు సమావేశాల్లో...
ఇప్పుడు మాత్రం ఎక్కడకు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లినా అక్కడ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నారు. పార్టీకి కార్యకర్తలు ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు. నేతలు పార్టీని వీడతారు కానీ, కార్యకర్తలు జెండాను వదలరని చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలను పట్టించుకోకుంటే ఊరుకోబోనని, ఎన్ని సార్లు టీడీపీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారన్నది ఎమ్మెల్యేల ఎదుటే లెక్కలు వేసి చెబుతున్నారు. కార్యకర్తల అండలేనిదే ఎవరూ గెలవలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూనే వారికి అవసరమైన సాయాన్నిఅందించేందుకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు.
ఎమ్మెల్యేలు విస్మరిస్తే...
తెలుగుదేశం పార్టీ ఏర్పడి యాభై ఏళ్లు కావస్తుండటం, సీనియర్ నేతలు పాతుకుపోయి ఉండటంతో వారు ఎన్నికల సమయంలోనే క్యాడర్ ను పట్టించుకుంటారన్నది వాస్తవం. అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. తమ ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యంగా ఎమ్మెల్యేలు పనిచేస్తుండటంతో కార్యకర్తలు అనేక చోట్ల ఆర్థికంగా ఇబ్బదులు పడుతున్నారన్న విషయం చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయన పార్టీ కార్యకర్తలను కాపాడే దిశగా చర్యలు ప్రారంభించారు. క్యాడర్ ను విస్మరిస్తే ఊరుకునేది లేదని, ప్రతిదీ కౌంట్ అవుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుండటంతో ఎమ్మెల్యేలు కూడా ఇక అలెర్ట్ గా ఉండాల్సిందేనంటున్నారు. లేకుంటే ప్రతిదీ కౌంట్ అయి.. తమ రాజకీయ మనుగడకు ముప్పు తప్పదని కూడా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నట్లే ఉంది.
Next Story