Mon Dec 08 2025 11:05:14 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu Naidu : పాత ఫార్ములాతోనే చంద్రబాబు వెళుతున్నారుగా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాత ఫార్ములతోనే ఈసారి కూడా ముందుకు వెళుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాత ఫార్ములతోనే ఈసారి కూడా ముందుకు వెళుతున్నారు. 2014 ఎన్నికల్లో ఏ ఫార్ములాతో అయితే వెళ్లారో అదే ఫార్ములాను ఈసారి కూడా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. 2027 నాటికల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు అందిస్తామని చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీనికి మూడేళ్లు గడువు పెట్టారు. అంటే 2028వ సంవత్సరం నాటికి మొదటి దశ అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసే లక్ష్యాన్నిఅధికారులకు నిర్దేశించారు.
రాజధాని నిర్మాణ పనులు పూర్తయితే...
అమరావతి రాజధాని నిర్మాణం మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయితే కొంత హైప్ వస్తుందని భావిస్తున్నారు. భారీభవనాలతో పాటు అక్కడ అధికారుల నివాసాలకు సంబంధించిన పనులు కూడా పూర్తవుతాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటుందన్న భావన అధికార పార్టీ నేతల్లో ఉంది. అయితే రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి కాంట్రాక్టు పొందిన సంస్థలు భవన నిర్మాణ కార్మికులకుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఉపయోగించడం కొంత విమర్శలకు దారి తీస్తుంది. ఇక్కడ జరుగుతున్న పనుల్లో ఏపీకి చెందిన భవన నిర్మాణ కార్మికులను వినియోగించుకోవాలన్న డిమాండ్ వినపడుతుంది.
సాగు, తాగు నీరు అందంచగలిగితే...
పోలవరం ప్రాజెక్టు పనులు కూడా ప్రస్తుతం ఎనభై శాతం పూర్తయ్యాయయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. 2027 నాటికిపనులు పూర్తి చేసి ఖరీఫ్ సీజన్ కు సాగు నీరు అందించగలిగితే చాలా వరకూ ప్రభుత్వం సక్సెస్ అయినట్లే. ముఖ్యంగా రైతులు ప్రయోజనం పొంది కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడే అవకాశముందని అంటున్నారు. నీటి పారుదల శాఖ అధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థల యాజమాన్యాలకు కూడా హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి చేయడమే కాకుండా రైతులకు సాగు నీరు అందించడంతో పాటుగా కొన్ని ప్రాంతాలకు తాగు నీటి సౌకర్యం కూడా కల్పించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు అధికారుల వెంట పడుతున్నారు.
భారీ వర్షాలు, వరదలకు...
కానీ భారీ వర్షాలకు రెండు పనులకు ఆటంకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో ఇంకా వర్షపు నీటిని తోడేందుకు మోటార్లను ముమ్మరంగా వినియోగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ పోటెత్తతుతున్న వరద పనులకు ఆటంకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అనుకున్న లక్ష్యానికి పోలవరం, అమరావతి పనులు పూర్తవుతాయా? లేదా? అన్న సందేహం కొంత అధికార పార్టీ నేతల్లో కనిపిస్తుంది. జమిలి ఎన్నికలు వస్తే ముందుగానే ఎన్నికలు వస్తే ఇక పనులు అసంపూర్తిగా నిలిచిపోతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఈ ఫార్ములా అనుకూలంగా పనిచేస్తుందా? లేదా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
Next Story

