Mon Apr 21 2025 18:23:04 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రిలాక్స్ మూడ్ లో చంద్రబాబు.. రీజన్ ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలాక్స్ మూడ్ లోనే ఉన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాక ముందు ఒకలా ఉంటారు. వచ్చిన తర్వాత మరొకలా వ్యవహరించేవారు. అయితే ఈసారి మాత్రం గత పథ్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కనిపించని మార్పు చంద్రబాబులో ఇప్పుడు కనిపిస్తుంది. గత పథ్నాలుగేళ్లు చంద్రబాబు నిర్వరామంగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. తనకుతానే రాష్ట్రానికి సీఈవోగా ప్రకటించుకున్నారు. ఆయన నాడు ఉంటే సీఎం ఆఫీసులో లేకుంటే జిల్లాల పర్యటనల్లో మరీ లేకపోతే పార్టీ కార్యాలయంలో... ఇలా గడిచేది ఆయన దినచర్య. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా 2014 నుంచి 2019 వరకూ దాదాపు అదే పంథాను కొనసాగించారు.
స్పష్టమైన మార్పు...
కానీ ఈసారి మాత్రం ఆయనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. రిలాక్స్ మూడ్ లో కనిపిస్తున్నారు. అంటే గతంలో మాదిరిగా అధికారులపై హడావిడి చేయడం కనిపించడం లేదు. ఆకస్మిక తనిఖీలు లేవు.తనను 1995 నాటి ముఖ్యమంత్రిగా చూస్తారని చంద్రబాబు ఆ మధ్య చెప్పినప్పటికీ ఆ విధమైన పోకడలకు ఆయన పోవడం లేదు. ఎంత కష్టపడినా ఇంతేలా అనుకున్నారో? మరి మరో కారణమో తెలియదు కానీ నాటి చంద్రబాబులో ఉన్న ఫైర్ కనిపించడం లేదన్నది ఆయనను దగ్గర నుంచి గమనిస్తున్న నేతలు చెబుతున్నారు. నాడు సెక్రటేరియట్ లో ఎనిమిదన్నర గంటల వరకూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించేవారు. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చేవారు. అక్కడ నేతలతో దాదాపు రాత్రి పది గంటల వరకూ చర్చించే వారు.
నేతలకూ దూరంగానే...
కానీ ఇప్పుడు నేతలతో చర్చించడం పూర్తిగా మానేశారంటున్నారు. ఏదైనా ఎన్నికలుంటే తప్ప ఆ జిల్లా నేతలతోనూ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమవ్వడం లేదు. ఇక ప్రతి శనివారం పార్టీ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాలనుకున్నా పని వత్తిడితో అన్ని సార్లూ అది సాధ్యం కావడం లేదు. కానీ వీలున్నప్పుడల్లా శనివారం మాత్రం పార్టీ ఆఫీసుకు వెళ్లి కార్యకర్తల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఆదివారం అయితే ఆయన చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నారు. వీలయితే శని, ఆదివారాలు హైదరాబాద్ వెళ్లిపోతారు. మంత్రులకు కూడా ఆదివారాలు ఫ్యామిలీలతో గడపాలని చంద్రబాబు చెప్పడం చూసి ఆయనలో వచ్చిన మార్పుకు సీనియర్ నేతలు విస్తుపోతున్నారు.
లోకేష్ అందిరావడంతో...
ఒకనాడు తాను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వననే నినాదం చంద్రబాబు అందిపుచ్చుకున్నారు.అలుపెరగకుండా పనిచేశారు. కానీ 2024 ఎన్నికల తర్వాత మాత్రం ఉదయం పదకొండు లేదా పన్నెండు గంటలకు సచివాలయానికి వస్తారు. తిరిగి ఆరు గంటలకు ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకుంటున్నారు. లోకేష్ చేతికి రాజకీయంగా అందిరావడంతో పార్టీ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. జిల్లాలో నేతల మధ్య విభేదాలనుకూడా లోకేష్ పరిష్కరిస్తుండటంతో చంద్రబాబుకు పెద్దగా రాజకీయంగా పనిలేకుండా పోయిందంటున్నారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే ఆయన పరిమితమవుతూ తన ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద 1995 నాటి చంద్రబాబుకు 2025 నాటి చంద్రబాబుకు మధ్య ముప్ఫయి ఏళ్ల తేడా స్పష్టంగా కనిపిస్తుందన్నది పార్టీవర్గాల టాక్.
Next Story