Tue Jul 08 2025 18:05:43 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : భూతాన్ని భూస్థాపితం చేస్తానంటున్న చంద్రబాబు మాటల్లో అర్ధమిదేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్లు కాన్ఫిడెన్స్ లో ఉన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్లు కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఆయన ఎక్కడకు వెళ్లినా ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు. మళ్లీ ఆ భూతాన్ని రానివ్వనంటూ వివిధ వర్గాల వారికి హామీ ఇస్తున్నారు. అంటే జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కారని చంద్రబాబు ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. తాజాగా ఫిక్కీ సమావేశంలోనూ జగన్ పేరు ఎత్తకుండా ఆ భూతాన్ని మళ్లీ రానివ్వనని, నాది హామీ అంటూ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కొత్త రాష్ట్రంలోనూ, నూతన రాజధానిలోనూ పెట్టుబడులు సమకూరాలంటే ఖచ్చితంగా అలాంటి హామీ ఇవ్వాల్సిందేనని, అందుకే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండ ఉండి ఉండవచ్చు అన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.
రానివ్వకపోవడానికి?
రానివ్వకపోవడానికి.. రాకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు వల్ల సాధ్యం కాదు. కాకపోవచ్చు కూడా. అధికార పార్టీ అది ఏదైనా.. వైసీపీ అయినా టీడీపీ అయినా మరొకటి అయినా ప్రజలు మార్పు కోరుకుంటారు. రానివ్వకుండా ఉండేది ఓటర్లు మాత్రమేనని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని, ఏడాదిలోనే ఒక ప్రభుత్వంపై ఇంతటి వ్యతిరేకత వ్యక్తమవ్వడం ఎక్కడా చూడాలేదని వైఎస్ జగన్ సాక్షాత్తూ వ్యాఖ్యానించారు. అధికార పార్టీపై సహజంగా వ్యతిరేకత ఉంటుంది. ఎంత మంచి చేసినా కొందరికే అందుతుంది. మిగిలిన వారిలో అసంతృప్తి రగులుతుంది. మరొకవైపు ఎమ్మెల్యేలపై పెరిగే అసంతృప్తి ఎన్నికల సమయానికి కాని తెలియదు.
జగన్ కూడా మార్చినా...
వైసీపీ అధినేత జగన్ కూడా ఆ అసంతృప్తిని గమనించి చాలా మంది ఎమ్మెల్యేలను మొన్నటి ఎన్నికల్లో నియోజకవర్గాలనే మార్చారు. మంత్రులను కూడా వదిలిపెట్టకుండా షిఫ్ట్ చేసేశారు. అయినా అలా మార్చిన వారిలో ఎవరూ గెలవకపోవడం ఇక్కడ చూడాలి. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును కూడా ప్రజలు బేరీజు వేసుకుంటారు. ఏపీ ఎన్నికలు పార్లమెంటు, అసెంబ్లీ ఒకేసారి జరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పనితీరు ప్రభావం కూడా కొంత పడుతుంది. అది అడ్వాంటేజిగా మరుతుందా? లేక అదే ఇబ్బందిగా తలెత్తుతుందా? అన్నది ఫలితాల తర్వాత మాత్రమే తేలుతుంది. అంతే కాని నేతల చేతుల్లో ఒకరి గెలుపును అడ్డుకోవడమంటే ఇప్పటికీ కొందరే దశాబ్దాల నుంచి ముఖ్యమంత్రులుగా చెలామణి అయ్యేవారు.
కూటమి కట్టినా...
తమిళనాడు వంటి రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకూ కాలుమోపకపోవడాన్ని కూడా ఉదహరిస్తున్నారు. అది ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా చివరకు తమిళనాడు విషయానికి వచ్చేసరికి రాజకీయంగా ఇబ్బంది పడుతుంది. అక్కడ పొత్తులు కూడా పనిచేయడం లేదు. తెలంగాణలోనూ సుదీర్థకాలం నుంచి చేస్తున్న పోరాటం విజయం వైపు నడవలేదు. మహారాష్ట్రలో ఒకసారి బీజేపీని కూడా కాదని అక్కడ కాంగ్రెస్ కూటమికి ప్రజలు పట్టం కట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే నేతల చేతుల్లో ఒకరి గెలుపు ఆపడం సాధ్యపడదని, అయితే ఆ మాత్రం నమ్మకం లేకపోతే ముందుకు వెళ్లలేక అలా చెప్పుకుంటూ వెళతారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. మూడు పార్టీలు కలిసినా విజయం సాధిస్తాయన్న నమ్మకం ఉండదు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మూడు పార్టీలపై పడుతుంది.
అందరూ కార్యకర్తలకు...
తెలంగాణలో వరసగా రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి కూడా తమదే విజయమని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. తానే శాశ్వత ముఖ్యమంత్రి భ్రమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్దగా మార్పు చేయకుండానే ఎన్నికలకు వెళ్లి చేతులు కాల్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక కార్యకర్తలకు అందరికీ న్యాయం జరగదు. ఏ పార్టీ అయినా కొందరికే వారి అవసరాలను తీర్చగలుగుతుంది. స్థానిక ఎమ్మెల్యేలు కూడా వేల సంఖ్యలో ఉన్న ముఖ్యమైన కార్యకర్తలను మెప్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అందుకే కార్యకర్తలు కూడా ప్రతి ఎన్నికల్లో తమ వైఖరిని మార్చుకుంటారన్న రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరి భూతాన్ని రానివ్వనన్న ధైర్యం చంద్రబాబు లో రావడానికి కారణమేంటో మాత్రం తెలియదు.
Next Story