Fri Dec 05 2025 16:45:00 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారంటే కేంద్ర మంత్రులకు దడేనట.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారంటే కేంద్ర మంత్రుల్లో గుండె దడ మొదలవుతుంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారంటే కేంద్ర మంత్రుల్లో గుండె దడ మొదలవుతుంది. ఆయన ఫైళ్లు పట్టుకుని మరీ వచ్చి రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టుల కోసం వస్తారు. అందుకే చంద్రబాబు ఢిల్లీ టూర్ అంటే కేంద్ర మంత్రులు ఆయన ఏ ప్రతిపాదనలు తీసుకు వస్తారోనన్న ఉత్కంఠ వారిలో నెలకొంటుందట. ఏ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి ఇన్నిసార్లు వచ్చి తమ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధుల కోసం ప్రయత్నించడం లేదని, కానీ చంద్రబాబు మాత్రం నెలలో రెండు సార్లు ఢిల్లీకి వచ్చి తమను కలసి వినతులను సమర్పించి తమ పనులను సాధించుకు వెళుతున్నారని కేంద్ర మంత్రులే అనుకుంటున్నారట.
మూడు రోజుల పాటు...
చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే చంద్రబాబు ఉండనున్నారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. రేపు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పాటు ఏడుగురు కేంద్ర మంత్రులతో శుక్రవారం భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై చర్చించనున్నారు. దీంతో చంద్రబాబు వస్తున్నారని, అపాయింట్ మెంట్ కావాలని అడిగిన వెంటనే వారు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు వివరాలను తెప్పించుకునే పనిలో ఉన్నారట.
ఎన్నికల హామీలను...
ముఖ్యంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ల మద్దతు పైనే ఆధారపడి ఉంది. వీరిద్దరూ మోదీ కంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నవారు. రాజకీయ అనుభవం ఉన్న నేతలు మాత్రమే కాకుండా తమకు అవసరమైన వాటిని పట్టుబట్టి సాధించుకోవడంలో దిట్టలని పేరుపొందారు. ఇద్దరి నేతల అవసరాలు కూడా కేంద్రానికి ఉండటంతో అడిగిన వెంటనే అపాయింట్ మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. అందులోనూ ఏపీ పరిస్థితి వేరు. అనేక హామీలు ఇచ్చి 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వంలో రెండు పార్టీలు కలసి ఉన్నాయి.
సామరస్యంగానే చెప్పి...
ఈ నేపథ్యంలో చంద్రబాబు తీసుకు వచ్చే ప్రతిపాదనలతో పాటు నిధుల విషయంలో కూడా చూసీచూడనట్లు వ్యవహరించాల్సి ఉంటుంది. చంద్రబాబు కూడా ఒక పట్టాన వదిలి పెట్టే రకం కాదు. ఆయన గత పర్యటనలో తనకు ఇచ్చిన హామీలను ఇంకా పెండింగ్ లో ఉండటాన్ని కూడా ప్రస్తావించి కేంద్ర మంత్రులను ఇరకాటంలో పడేస్తారు. అంతే కాదు సామరస్యంగా, సానుకూలంగా మాట్లాడుతూనే రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైన ప్రాజెక్టులను, నిధులను తీసుకెళ్లడంలో చంద్రబాబు నేర్పరి అని హస్తినలో టాక్. అందుకే చంద్రబాబు హస్తిన ప్రయాణం అంటే టీడీపీ పార్లమెంటు సభ్యుల హడావిడి అటుంచితే.. కేంద్ర మంత్రులు మాత్రం హై అటెన్షన్ లో ఉండాల్సిందేనట.
Next Story

