Mon Jan 20 2025 02:32:24 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బీదపలుకుల బాబుకు ఆ మూడింటికి మాత్రం నిధులు కొరత లేదట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాత్రం ఒక విషయంలో మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాత్రం ఒక విషయంలో మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే. ఆయన అనుకున్నదే చేస్తారు. అంతే తప్ప జనం ఏమనుకుంటారోనని అస్సలు వెనకడుగు వేయరు. ఆయన రాష్ట్ర విభజన జరిగి 2014 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కేవలం మూడు అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. నాడు ఐదేళ్లలో ఆ మూడు పనులు పూర్తి చేయలేకపోయారు. అందులో ఒకటి రాజధాని అమరావతి. రెండోది పోలవరం. మూడోది నదుల అనుసంధానం. ఇప్పుడు 2024లోనూ అవే సబ్జెక్టులు ఏపీ చుట్టూ తిరుగుతున్నాయి. కాదు.. కాదు.. చంద్రబాబు వాటిని ఏమాత్రం మర్చిపోలేదు. వాటి వెనక పడుతున్నారు. ఆ మూడింటి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు.
వేదిక ఎక్కడయినా...
ఏ సభలో ఆయన ప్రసంగించినా... అది వేదిక ఎక్కడయినా.. ఏపీలోనైనా.. విదేశాల్లోనైనా ఈ మూడు అంశాలు ప్రస్తావనకు రాకుండా ఆగవు. అయితే ఈసారి మాత్రం అమరావతిపై కొంత అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తుంది. ఎక్కడ పట్టినా ఆయన అమరావతి గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయితే సంపద దానంతట అదే పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. కానీ మళ్లీ హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాలను చేపడుతున్నారు. అలాగే రహదారుల నిర్మాణం కూడా పూర్తి కావాలని సంకల్పించారు. ఈ నెలలోనే పనులను ప్రారంభించేందుకు సిద్ధమవుతారు. ప్రతిష్టాత్మకమైన సంస్థలను అమరావతికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడే ఆయన ఐదు ఎకరాలను కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేపడతానని ప్రకటించి ఇక్కడి భూములకు హైప్ తెచ్చే ప్రయత్నంచేశారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి...
ఇక పోలవరం పనులను కూడా ఈ నెలలోనే ప్రారంభించాలని రెడీ అవుతున్నారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించి సమీక్ష చేసిన అనంతరం ఆయన జనవరి నెల నుంచి పనులు ప్రారంభించాలని అధికారులకు టైం బౌండ్ కార్యక్రమాన్ని కూడా నిర్దేశించారు. పోలవరం నిర్మాణ పనులను ఈసారైనా పూర్తిచేయగలరా? అన్న అనుమానం టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతుంది. ఎందుకంటే భారీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం కావాల్సి ఉంటుంది. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వంటివి కల్పించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించుకుని ఈ టర్మ్ లో దానిని పూర్తిచేయగలిగితేనే చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందులుండవు.
నదుల అనుసంధానం....
మరోవైపు నదుల అనుసంధానం గురించి కూడా పదే పదే ప్రస్తావిస్తుంటారు. గోదావరి నది నీటిని రాష్ట్ర మంతటా నింపి ఆయకట్టు పెంచాలన్నది ఆయన ఆకాంక్ష. దానికి జలహారతి అని పేరు పెట్టారు. మరి దీనిని ప్రారంభించాలంటే వేల కోట్ల రూపాయల నిధులు అవసమవుతాయి. ప్రాజెక్టుల నిర్మాణం,నిర్వహణ ప్రయివేటు సంస్థలకు అప్పగించాలనుకుంటున్నారన్న విమర్శలు కూడా ఆయన లెక్కచేయడం లేదు. తాను అనుకున్నదే చేస్తానని చెబుతున్నారు. ఈ మూడు అంశాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమయిన చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల అమలుకు వచ్చేసరికి మాత్రం బీదపలుకులు పలుకుతుండటంపై ప్రజల్లో ఒకరకమైన అసంతృప్తి నెలకొంది. కానీ చంద్రబాబు మాత్రం ఈ మూడు అంశాలనే ముందుకు తెస్తూ ఆ విధంగా ముందుకు వెళుతున్నారన్నమాట.
Next Story