Fri Dec 05 2025 13:36:41 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబులో అప్పటికీ - ఇప్పటికీ ఎంత తేడా? గమనించారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను తీసుకెళ్లడంలో దృష్టి పెట్టడం పక్కన పెడితే మిగిలిన విషయాల్లో ఆయన ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు మూడు దఫాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకోని రాజకీయ పరమైన నిర్ణయాలు ఈ సారి మాత్రం తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఏమైనా తప్పులు చేస్తే వెంటనే చర్యలకు దిగేవారు కాదు. దానిపై సాగదీసేవారు. నాడు సోషల్ మీడియా ప్రభావం కూడా తక్కువగా ఉండటంతో అటువంటి ఘటనలపై నిజనిర్ధారణ కమిటీలను వేసేవారు. పార్టీ వారినే పంపి అందులో నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేసేవారు.
కాలయాపన చేస్తూ...
అయితే అంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాస రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించారు. అంతే తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలు చాలా తక్కువనే చెప్పాలి. ఎక్కువగా పార్టీ క్రమశిక్షణ కమిటీ, నిజనిర్ధారణ కమిటీలను నియమించి కాలయాపన చేస్తూ ఆ ఘటన మర్చిపోయిన తర్వాత షరా మామూలయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. వెను వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక వేధింపుల విషయం తెలిసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేయించారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఉండేవి కావని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.
గతంలో ప్రజా సమస్యలపై...
ఇక గతంలో ప్రజా సమస్యలపై ఎవరైనా ఆందోళనలు చేసినా వెంటనే స్పందించే వారు కాదు. అలాగే విపక్ష నేతలు వెళ్లి అక్కడ పర్యటనలు చేసినా పట్టించుకునే వారు కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై ఆయన కఠినంగా వ్యవహరించారు నాడు. కానీ నేడు అలా కాదు. ఏ మాత్రం నిరసనలు, ఆందోళనలు కనిపించినా వెంటనే చంద్రబాబు రియాక్ట్ అవుతున్నారు. మిరప, పొగాకు, చిత్తూరు మామిడి రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో విపక్ష నేత అక్కడ పర్యటనలకు చేయకముందే ఆ సమస్యపై స్పందించారు. తాజాగా దివ్యాంగులను నెలకు పదిహేను వేల రూపాయల పింఛన్లు తొలగించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆందోళనకు దిగితే వెంటనే స్పందించి అర్హులైన అందరికీ ఇస్తామని ఆయనే చెప్పారు. ఇక స్మార్ట్ మీటర్ల విషయంలోనూ ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు కమర్షియల్ భవనాలకే పరిమితం చేయడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. చంద్రబాబులో వచ్చిన ఈ మార్పు చూసిన పార్టీ సీనియర్ నేతలు మాత్రం ఆశ్చర్యపోతున్నారు.
Next Story

