Fri Mar 21 2025 06:42:21 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అలెర్ట్ అయిన చంద్రబాబు.. ముప్పు రాకముందే?
ఢిల్లీలో జరుగుతున్నపరిణామాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలెర్ట్ అయ్యారు

అనుభవమున్న రాజకీయ నేతలు దూరదృష్టితో ఆలోచిస్తారు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని అంచనా వేస్తారు. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారు. జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోదీ ఎలాంటి వ్యూహలు రచిస్తారో? ఏపీ విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే తీరులో వ్యవహరిస్తారు. ప్రతి నిమిషం.. ప్రతి అడుగు రాజకీయం వైపు వారి అడుగులు ఉంటాయి. ప్రతి నిర్ణయం వెనక ఒక అర్థం దాగుంటుంది. ఎవరేమనుకున్నా ఇప్పుడు చంద్రబాబు వల్ల బీజేపీ కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. అదే సమయంలో చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ అంత గుడ్డిగా కూడా నమ్మరు.
మోదీ రాజకీయం తెలిసి...
అలాగే చంద్రబాబు కూడా తరచూ మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ చాలా జాగ్రత్తగా ఉంటారు. అనేక రాష్ట్రాల్లో జరిగిన, జరుగుతున్నపరిణామాలు ఆయనకు తెలియంది కావు. తమకు అనుకూలంగా లేని వారిని నిర్దాక్షిణ్యంగా నరేంద్ర మోదీ అణిచివేస్తారని చంద్రబాబుకు తెలుసు. రాజకీయంగా అణగదొక్కేందుకు ఆయన ప్రతినిమిషం ఆలోచిస్తారని భావిస్తారు. అందుకే తన జాగ్రత్తలో తాను ఉంటారు. అందులో చంద్రబాబు తప్పు ఏమీ కాదు. ఎందుకంటే ఇది రాజకీయం. రాజకీయాల్లో రాత్రికి రాత్రి పరిణామాలు మారిపోతే తర్వాత బాధపడి లాభం ఉండదు. అందుకే ప్రతి క్షణం అడుగు అప్రమత్తంగానే వేస్తారు.ఇతర రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీల పార్లమెంటు సభ్యులను తమ పార్టీలోకి బీజేపీ లాక్కుంటుందన్న ప్రచారం వచ్చిన వెంటనే చంద్రబాబు కూడా అలెర్ట్ అయ్యారు.
ఇద్దరి దయాదాక్షిణ్యాలపైనే...
ఇప్పటికే బీజేపీలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. ఇద్దరు రాజకీయంగా సీనియర్ నేతలు. ఇద్దరు నేతల నుంచి భారీగా రాష్ట్ర అవసరాలకు సంబంధించిన డిమాండ్లు ఉంటాయి. ఇద్దరిదీ రాజకీయంగా నిలకడలేని మనస్తత్వం అని మోదీకి తెలుసు. అందుకే తన జాగ్రత్తలో తాను ఉంటున్నారు. అందులో భాగంగా సొంతంగా బీజేపీ బలంపెంచుకోవడంపై మోదీ సర్కార్ దృష్టి పెట్టిందని జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సయితం మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను ప్రత్యేక సలహాదారుగా నియమించారు. దిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఠాకూర్ విధులు నిర్వహిస్తారని, రెండేళ్ళ పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు.
సీనియర్ ఐపీఎస్ అధికారిగా...
ఆర్పీ ఠాకూర్ 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన డీజీపీగా బాధ్యతలను నిర్వహించారు. అయితే టీడీపీ సభ్యులు బీజేపీలోకి పోకుండా ఠాకూర్ తో చెక్ పెట్టేందుకు చంద్రబాబు ఈ నియామకం చేపట్టినట్లు తెలిసింది. మామూలుగా అయితే చంద్రబాబు కంభంపాటి రామ్మోహన్ రావు వంటి నేతలను ఢిల్లీలో నియమిస్తుంటారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఠాకూర్ ను నియమించడం వెనక ఎంపీలు చేజారి పోకుండా తనకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందచేయడానికి ఠాకూర్ ను నియమించారని పార్టీ వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి. మొత్తం మీద ఎత్తుకు పై ఎత్తు వేయడంలో ఇద్దరు నేతలు ఒకరికి ఒకరు తీసిపోరన్నది మాత్రం నిజం.
Next Story