Mon Jun 23 2025 03:53:26 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబుకు ఏడాదికే "సీన్" అర్థమయిందా? అందుకే మేల్కొన్నారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు నాలుగేళ్లకు ముందే అలెర్ట్ అయినట్లు కనిపిస్తుంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు నాలుగేళ్లకు ముందే అలెర్ట్ అయినట్లు కనిపిస్తుంది. ఎమ్మెల్యేల పనితీరును గమనించకపోతే అసలుకే ఎసరు వస్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో కూటమి హవాలో 164 స్థానాల్లో సూపర్ డూపర్ విక్టరీ సాధించినప్పటికీ గత ఏడాదిగా కూటమి పార్టీల నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో, కిందిస్థాయిలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో పాటు విభేదాలు మరింతగా ముదిరి వీధిన పడుతుండటంతో మూడు పార్టీలకు తలనొప్పిగా తయారయింది. అన్ని చోట్ల ఆధిపత్య పోరు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల పనితీరు కూడా అంత ఆశాజనకంగా లేదని అందుతున్న నివేదికలను బట్టి తెలుస్తోంది.
సమస్య అంతా...
ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో అత్యధికంగా 88 మంది వరకూ మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలతోనే సమస్య తలెత్తుతోంది. సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల ఈ సమస్య పెద్దగా కనిపించడం లేదు. వారిపై పెద్దగా ఆరోపణలు కూడా రావడం లేదు. ఎందుకంటే వారి అనుభవంతో అనేక విషయాలను బయటకు రాకుండానే సహజంగా జాగ్రత్త పడుతున్నారు. కానీ కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు మాత్రం నేరుగా రంగంలోకి దిగి బ్యాడ్ నేమ్ ను కొని తెచ్చుకుంటున్నారు. ఇసుక తరలింపు, మద్యం షాపుల వేలంపాటలు, బార్లను కొనసాగించడం, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో తలదూర్చడం వంటి విషయాల్లో కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేల పేర్లు జనం నోళ్లతో నానుతున్నాయి.
ఎమ్మెల్యేల పనితీరుపై...
ఒకవైపు సంక్షేమ పథకాలు అందలేదని జనంలో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో మరొకవైపు అవినీతిని ఎమ్మెల్యేలే దగ్గరుండి ప్రోత్సహిస్తుండటం కూడా ప్రజల్లో పలచనకు కారణమయింది. ఇలాగే ఉపేక్షిస్తే వచ్చే ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చూడాల్సి వస్తుందని చంద్రబాబు తన అనుభవంతో ముందే గుర్తించారు. తాము పరిపాలనలో ఎన్ని సంస్కరణలు, ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు సక్రమంగా లేకపోతే అసలుకే మోసం వస్తుందని భావించిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల ముందే అప్రమత్తమయ్యారు. అందుకే ఎమ్మెల్యేలను గాడిలో పెట్టేందుకు తన వంతుగా ఆయన ప్రయత్నాలను ప్రారంబిస్తున్నట్లు కనపడుతుంది.
గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ...
ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు , కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి.. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనేది తన ఆలోచన అని నేరుగా చెప్పేశారు. ప్రజలు అన్నీ గమనిస్తారని, జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ఇబ్బందులు పడతారని చంద్రబాబు గట్టిగానే హెచ్చరించినట్లు తెలిసింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు, నివేదికలు తెప్పించుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అంతేకాదు తాను మంచి చేస్తే అభినందిస్తానని, తప్పు చేస్తే దూరం పెడతానని కూడా చెప్పారు. త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహించేందుకు కూడా చంద్రబాబు సిద్ధమవుతుండటం చూస్తుంటే కూటమికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చంద్రబాబుకు కూడా అర్థమయినట్లే కనిపిస్తుంది.
Next Story