Mon Dec 15 2025 18:40:25 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదిగి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు 75వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు 75వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఆయన వయసు 75 ఏళ్లయినా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమై యాభై ఏళ్లు అవుతుంది. అంటే అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి కాకలు తీరిన నేతగా ఎదిగాడు. ఏ మాత్రం గ్లామర్ లేని.. ఎలాంటి ఆకట్టుకునే ప్రసంగాలు చేయకపోయినా చంద్రబాబు కేవలం చేతల్లో మాత్రమే సూపర్ లీడర్ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ కు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే ఊరికే కాలేదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విమర్శలను పడ్డారు. అయినా పడి లేచిన కెరటంలా చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది.
అంచెలంచెలుగా ఎదిగి...
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా మరో పదిహేనేళ్లు ఆంధ్రప్రదేశ్ ను ఏలినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 1950లో చిత్తూరు జిల్లా నారావారపల్లె అనే కుగ్రామంలో జన్మించిన చంద్రబాబు అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నారన్న అపవాదును ఎదుర్కొన్నప్పటికీ ఆయన సమర్ధవంతంగా ప్రజల్లో దానికి మద్దతు పొందగలిగారు. ముఖ్యమంత్రి అయ్యారు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తనకు తాను సీఈవోగా రాష్ట్రానికి ప్రకటించుకున్నారు. చిన్న వయసులో ముఖ్యమంత్రి కావడంతో పాటు గత ముఖ్యమంత్రులను చూసిన ప్రజలకు చంద్రబాబు పాలన కొత్తగా కనిపించింది. ఆకస్మిక తనిఖీలు, సంస్కరణలు.. ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
ఓటములు ఎదురయినప్పుడు...
1999లో రెండో సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 2004లో ఓటమి పాలయ్యారు. 2009లోనూ ఆయన మరోసారి అపజయం వెంటాడింది. ఇక చంద్రబాబు పని అయిపోయినట్లేనని ప్రత్యర్థులు చేసే విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోయారు. మొక్కవోని ధైర్యంతో మొండిగానే తన పని తీను చేసుకు పోయారు. 2004, 2009లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయినప్పుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎంతో మంది నేతలు హ్యాండిచ్చివెళ్లిపోయారు. అయినా ఏ మాత్రం వెరవలేదు. తిరిగి పార్టీని నిలబెడతానన్న నమ్మకం ఆయనలో అణువణువునా కనిపించేది. ఇక ఇంట్లో తక్కువ పార్టీ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువ సమయం గడిపేవారు. రాజకీయాలే శ్వాసగా ఆయన ముందుకు సాగారు.
ఎన్నో విమర్శలు...
2019లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయినప్పుడు కూడా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే తన రాజకీయ చాణక్యంతో ఆయన మళ్లీ కూటమిని ఏర్పాటు చేశారు. ప్రత్యర్థి బలహీనతలను సులువుగా కనిపెట్టి దానికి విరుగుడు కనిపెట్టి పొలిటికల్ గా దెబ్బతీయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందకే ఎవరు హేళన చేసినా, ఎందరు కవ్వించినా ఆయన మౌనంగానే ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో కూటమిని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లి అఖండ మెజారిటీతో గెలుపొందారు. నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు విజన్ అంటూ కబుర్లు చెబుతారన్న విమర్శలకు ఆయన వేలు సైబరాబాద్ వైపు చూపుతుంది. ఐటీ రంగాన్ని, 2020 విజన్ ను నాడు హేళన చేసిన వారు నేడు నిజమయిందని నమ్ముతున్నారు. అందుకే చంద్రబాబు నూరు వసంతాలు నిండుగా జీవించాలని "తెలుగు పోస్ట్" కోరుకుంటుంది. హ్యాపీ బర్త్ డే నాయుడు గారూ.
Next Story

