Sat Dec 13 2025 22:33:23 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబుకు ఈసారి కూడా అంత సులువు కాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. విజన్ ఉన్న లీడర్ కూడా. అయితే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆయన ఎంతవరకూ గట్టున పడేయగలరన్నదే ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కలుగుతున్న అనుమానం. హైదరాబాద్ వేరు. ఒక నిర్ణయం తీసుకున్నా.. అప్పటికే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడంతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలకు అది అనుకూలమైన నివాసయోగ్య ప్రాంతంగా ఉండటం, వాతావరణం అనుకూలత ఇన్ని ప్లస్ పాయింట్ల మధ్య చంద్రబాబు సక్సెస్ సాధించి ఉండవచ్చు. కానీ అమరావతి విషయంలో సక్సెస్ సాధించడం అంత సులువు కాదన్నది వాస్తవం.
శంకుస్థాపన నుంచి...
మొదటి నుంచి అన్నీ ప్రారంభించాలి. పొలాల్లో రాజధాని నిర్మాణాలను చేపట్టడమే ఒక సాహసోపేతమైన నిర్ణయం. రాజధాని నిర్మాణానికే ఏళ్లు పడుతుంది. భవన నిర్మాణాలకు తరచూ వచ్చే వానలు, సంభవించే పనులు వంటివి సహకరించకపోవచ్చు. ప్రకృతి కూడా రాజధాని నిర్మాణానికి అంత అనుకూలంగా ఉండదు. అదే సమయంలో ఎ నుంచి మొదలుపెట్టి ఎక్కడ వరకూ వెళ్లాలన్నదిఎవరికీ తెలియని పరిస్థితి. రాజధాని నిర్మాణం పూర్తి అంటే కేవలం నాలుగు భవనాలు నిర్మించితే సరిపోదు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కావాలి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సహకరిస్తుంది కాబట్టి గుడ్డిలో మెల్ల. కానీ ఎన్ని కోట్లని అప్పులు తెచ్చి అక్కడ అభివృద్ధి చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
మరో మూడేళ్లలో ఎన్నికలు...
ఎందుకంటే మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ ఈసారి రాజకీయ అవసరం బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఉండొచ్చు. ఉండకపోవచ్చు. రాజకీయ అవసరం, టీడీపీ మద్దతు అవసరమైతేనే రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదీ నిధులు ఇచ్చి కాదు.. రుణాలు తీసుకోవడంలో వెసులుబాటు మాత్రమే. కానీ వచ్చే ఎన్నికల్లో మోదీ పార్టీకి బంపర్ మెజారిటీ వచ్చి ఏపీ పార్టీల రాజకీయ అవసరం లేకపోతే మాత్రం రాజధాని కాదు కదా.. ఏపీ వైపు కూడా కేంద్ర ప్రభుత్వం చూసే అవకాశముండదు.అందుకే రాజధాని నిర్మాణం మాత్రం చంద్రబాబుకు ఒక సవాల్ అని చెప్పాలి. చెప్పినంత సులువు కాదు. ఆదేశాలు ఇచ్చినంత ఈజీ కాదు.అన్నీ సహకరించాలంటే అందుకు చాలా సమయం కావాలి. కావాల్సిన నిధులు కావాలి. మరి ఇవన్నీ దక్కాలంటే ఎన్నేళ్లన్నది మాత్రం ఎవరికీ తెలియదు.
Next Story

