Fri Dec 05 2025 13:50:32 GMT+0000 (Coordinated Universal Time)
CM Ramesh : సీఎం రమేష్ కు శత్రువులు ఎక్కడో లేరుగా?
అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేత. అయితే ఆయనకు బీజేపీలోనే శత్రువులు తయారయినట్లు కనపడుతుంది

అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేత. అయితే ఆయనకు బీజేపీలోనే శత్రువులు తయారయినట్లు కనపడుతుంది. సీఎం రమేష్ వ్యవహారశైలిని సహచర పార్లమెంటు సభ్యుడు ఎండగట్టడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో సీఎం రమేష్ కు ప్రత్యర్థులు ఎక్కడో లేరని, సొంత పార్టీలోనే ఉన్నారన్న విషయం మరోసారి అర్థమయింది. సీఎం రమేష్ కడప జిల్లాకుచెందిన నేత. పారిశ్రామిక వేత్త. ఆయన టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండి 2019 లో ఏపీలో పార్టీ ఓటమి పాలుకాగానే బీజేపీలో చేరారు. సీఎం రమేష్ బీజేపీలోకి వచ్చి నిండా ఐదేళ్లు గడిచాయి. ఐదేళ్ల కాలంలో తానే బీజేపీలో ముఖ్యుడని బిల్డప్ ఇచ్చుకోవడం ఏంటని అదే పార్టీకి చెందిన బీజేపీ ఎంపీ పరువు తీశారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై...
నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇప్పటికి రెండు సార్లు బీజేపీ ఎంపీగా గెలిచారు. ఆయన తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ లో ఉన్నా, బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ అరవింద్ బీజేపీని ఎంచుకున్నారు. నిజామాబాద్ టిక్కెట్ ను పొంది 2019, 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ సొంత పార్టీ ఎంపీ సీఎం రమేష్ పరువు తీశారు. ఒక టీవీ ఛానల్ లో ఆయన మాట్లాడుతూ సీఎం రమేష్ కు అంత సీన్ లేదని తేల్చి చెప్పడం ఇప్పుడు తెలంగాణలోనే కాదు. ఏపీలోనూ చర్చనీయాంశమైంది. సీఎం రమేష్ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి నుంచి పెద్దయెత్తున కాంట్రాక్టులు పొందేందుకు సీఎం రమేష్ ఆయనకు సహకరించారంటూ కేటీఆర్ ఆరోపించారు.
ఆయన అనుభవమెంత?
దీనిపై సీఎం రమేష్ మాట్లాడుతూ బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయడానికి కేటీఆర్ తన వద్దకు వచ్చాడని, తాను అది పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పానని అన్నారు. తాను గతంలో కేటీఆర్ గెలుపు కోసం నిధులు కూడా ఇచ్చానని సీఎం రమేష్ బహిరంగంగానే చెప్పారు. అయితే ధర్మపురి అరవింద్ మాత్రం సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ లో బీ ఆర్ ఎస్ విలీనం ప్రతిపాదన ఏది లేదని అరవింద్ తేల్చి చెప్పారు. టీడీపీ నుండి వచ్చినాయన.. పక్క రాష్ట్రం ఎంపీతో మాట్లాడటానికి కేటీఆర్ ఏమైనా పిచ్చోడా..? అంటూ వెటకారం చేశారు. ఆయన ఏజ్ ఎంత?... బీజేపీలో ఆయన స్థాయి ఏంటి? ఆయనతో ఎందుకు మాట్లాడతారంటూ? సీఎం రమేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి దీనికి సీఎం రమేష్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
Next Story

