Fri Feb 14 2025 11:08:28 GMT+0000 (Coordinated Universal Time)
Free Bus for Women : ఫ్రీ బస్సుపై కీలక అప్ డేట్.. అమలులో మార్పులు ఇలా ఉంటాయట
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వ వర్గాల నుంచి కీలక అప్ డేట్ వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వ వర్గాల నుంచి కీలక అప్ డేట్ వచ్చేసింది. ఉగాది నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అంటే ఇంకా నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఉగాది కానుకగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు దీనిపై అథ్యయనం చేయడానికి మంత్రుల కమిటీని కూడా చంద్రబాబు నియమించారు. హోం శాఖ, రవాణాశాఖ, మహిళ శిశు సంక్షేమశాఖకు చెందిన మంత్రులతో కమిటీని నియమించింది. ఈ మంత్రుల కమిటీ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొంది.
మంత్రుల కమిటీ పర్యటించి...
రాష్ట్రాల్లో పర్యటించిన మంత్రుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. కర్ణాటక, తెలంగాణలలో అమలవుతున్న విధానంలో లోటు పాట్లను కూడా అధ్యయనం చేసి ఈ నివేదికలో పొందు పర్చినట్లు తెలిసింది. ఈ రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువ మంది ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో పురుషులకు ప్రయాణం చేయడానికి సరైన సౌకర్యాలు లేవని, సీట్లు కూడా కొన్ని రూట్లలో దొరకడం లేదని కమిటీ దృష్టికి వచ్చింది. అదే సందర్భంలో కర్ణాటక, తెలంగాణలలో అంతరాష్ట్ర సర్వీసులకు మాత్రమే ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తుంది. పొరుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల వరకు మాత్రమే ఉచిత బస్సులో మహిళలను అనుమతిస్తుంది. దీంతో పాటు కొన్ని సర్వీసులకు మాత్రమే ఉచిత సర్వీసును అందుబాటులో అక్కడ ఉన్న విషయాన్ని కూడా నివేదికలో పొందుపర్చింది.
నివేదికలో ఇలా...
కర్ణాటకలో ఉచిత బస్సు పథకం వల్ల బడ్జెట్ పై భారం పడిందని, అందువల్ల ఆర్టీసీ బస్సుల ధరలు పెంచారని పేర్కొంది. అలాగే తెలంగాణాలోనూ ఉచిత బస్సు కారణంగా కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడంతో వారు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన విషయాన్ని కూడా నివేదికలో పొందుపర్చినట్లు తెలిసింది. వీలయనన్ని ఎక్కువ బస్సులను కొనుగోలు చేయడంతో పాటు అదనపు సిబ్బందిని కూడా తీసుకోవాల్సి ఉంటుందని కమిటీ చేసిన సిఫార్సుల్లో పేర్కొంది. నెలకు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల వరకూ భారం పడే అవకాశముందని కూడా పేర్కొన్నట్లు తెలిసింది. ఆటో కార్మికుల నుంచి కూడా అక్కడి ప్రభుత్వాలు నిరసనను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. దీంతో ఈ లోటుపాట్లను అన్నింటినీ అధిగమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉగాదినుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది.
Next Story