Tue Mar 10 2026 15:55:32 GMT+0530 (India Standard Time)
Amanchi : ఆమంచి గుంటూరుకు వచ్చింది అందుకేనా? కండిషన్ ఏమని పెట్టారంటే?
ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది

ప్రకాశం జిల్లా కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఆయన ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబును కలిసిన సమయంలో నేతల మధ్య కూడా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి, జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయనను రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం నేతలు పరామర్శిస్తున్నారు. అందులో భాగంగానే ఆమంచి కృష్ణమోహన్ కూడా వచ్చినట్లు అందరూ భావించారు. కానీ ఆయన క్రమంగా తిరిగి వైసీపీకి దగ్గరవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇస్తే తాను వైసీపీలో చేరడానికి సిద్ధమని ఆమంచి కృష్ణమోహన్ ఇప్పటికే పార్టీ నాయకత్వానికి సంకేతాలు పంపారని చెబుతున్నారు.
చీరాల నుంచి...
చీరాల నియోజకవర్గంలో కరణం కుటుంబం యాక్టివ్ గా లేరు. అదీ కాకుండా కరణం వెంకటేశ్ ను అద్దంకి నియోజకవర్గానికి పంపాలన్నది జగన్ ఆలోచన. అదే జరిగితే తిరిగి చీరాలకు ఆమంచి కృష్ణమోహన్ కు అవకాశం కల్పిస్తే బాగుంటుందని జగన్ కూడా భావిస్తుందని అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఆమంచి కి కొందరు ప్రకాశం వైసీపీ నేతల ద్వారా సమాచారం పంపినట్లు తెలిసింది. అయితే ముహూర్తం చూసుకుని చేరాలని ఆమంచి కృష్ణమోహన్ భావిస్తున్నారు. ఇప్పుడు చేరాలా? లేక జగన్ పాదయాత్ర సమయంలో చేరితే పార్టీతో పాటు తనకు మంచి హైప్ వస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
జగన్ హామీ ఇస్తేనే...
అంతకు ముందు ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా నియమించి జగన్ తప్పు చేశారని ఆమంచి వర్గీయులు అంటున్నారు. ఆయనకు బలమున్న చీరాల కాకుండా పర్చూరుకు మారిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఆయన గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చీరాల పర్యటనలో కూడా ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. అయితే ఆయన వైసీపీలో చేరాలంటే తనకు స్పష్టమైన హామీని ఇవ్వాలని, అది జగన్ ఇచ్చిన తర్వాత మాత్రమే పార్టీలోకి వస్తానని చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ చెబితే చాలు ఆమంచి కృష్ణమోహన్ మంచి ముహూర్తం చూసుకుని వైసీపీలో చేరే అవకాశాలయితే ఉన్నాయి. చీరాల నియోజకవర్గంలో బలమైననేతగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ మరోసారిపార్టీ మారేందుకుసిద్ధమవుతున్నారని తెలిసింది.
Next Story

