Fri Dec 06 2024 04:21:23 GMT+0000 (Coordinated Universal Time)
TDP : సైకిల్ తొక్కడం కష్టమనేనా? ఇక రాజకీయ భవిష్యత్ లేనట్లేగా
టీడీపీలో సీనియర్ నేతలందరూ దాదాపు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లే కనపడుతుంది
టీడీపీలో సీనియర్ నేతలందరూ దాదాపు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లే కనపడుతుంది. పార్టీలోనూ, నియోజవర్గాల్లోనూ వారు పట్టు కోల్పోవడంతో పాటు నేటి తరంతో వారు పరుగులు తీయలేరని, పాత పద్ధతుల నుంచి బయట పడటక పోవడంతో చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలను మొన్నటి ఎన్నికల్లోనే పక్కన పెట్టారు. కొందరు నేతలు తాము స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోగా, మరికొందరిని చంద్రబాబు కావాలనే తప్పించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చేయించిన సర్వేల్లో వీరికి ప్రజల నుంచి సరైన మద్దతు లభించకపోవడమూ కారణమే.
నిత్యం ప్రజల్లో ఉంటేనే...?
ఈనాటి రాజకీయాల్లో నిత్యం ప్రజల్లో ఉండాలి. వివాహాలు, మరణాలకు ఒక్కటేంటి.. ఏ ఇంట్లో కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే ఖచ్చితంగా హాజరయ్యే పరిస్థితులున్నాయి. అలా మారిపోయింది. ఒకనాడు అలా కాదు. ముఖ్యమైన నేతల ఇళ్లకే ఎమ్మెల్యేలు వెళ్లేవారు. గ్రామాల్లోకి కూడా ఎన్నికలకు ముందు వెళ్లి అలా కనిపించి వచ్చే వారు. కానీ ఇప్పుడు అలా కాదు...గ్రామాలను ఖచ్చితంగా నెలలో ఒకసారి విజిట్ చేయాల్సిందే. అక్కడే వారితో కూర్చుని భోజనం చేయాల్సిందే. ఆరోజు అంతా ఆ గ్రామస్థులతో గడిపి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలు ఎక్కువగా డిమాండ్ చేసే పరిస్థితి ఎక్కువగా ఉంది.
పాత రాజకీయ పద్ధతులను
ఈ పరిస్థితుల్లో వయసు మీద పడటం, పాత రాజకీయ పద్ధతులను వదులుకోకపోవడం, వాటినే పట్టుకుని వేలాడుతుండటంతో ప్రజల వారంటే ఒకరకమైన ఏహ్యభావం ఏర్పడింది. దీంతో సీనియర్ నేతలు అధికార తెలుగుదేశం పార్టీలో కనిపించడం లేదు. అంతా యువరక్తంతో నిండిపోయింది. ఇది మంచిపరిణామమే అయినా కొన్ని సార్లు అనుభవం కూడా రాజకీయాలకు అవసరం అవుతుంది. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్నా ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక కేఈ కుటుంబం కూడా దాదాపు పక్కకు తప్పుకుంది. ఆయన కుమారుడు శ్యాంబాబ్ మాత్రమే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అశోక్ గజపతిరాజు వంటి సీనియర్ నేత కూడా ఏ పదవి లేకుండా విజయనగరంలో ఖాళీగా కూర్చున్నారు.
ఒకప్పుడు చక్రం తిప్పిన వారు...
రాయపాటి కుటుంబం రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంది. రాయపాటి సాంబశివరావుకు కూడా వయసు మీరడంతో ఆయనకు ఎంపీ టిక్కెట్ కూడా చంద్రబాబు ఇవ్వలేదు. దీంతో ఆ కుటుంబం పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్లయింది. ఇక మాగుంట బాబు వంటి వారిని కూడా చంద్రబాబు పక్కన పెట్టారు. ఇలా అనేక మంది సీనియర్ నేతలు ఒకప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన వారు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించకుండా పోయారు. వారిలో కొందరికే పెద్దల సభకు అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారని తెలిసింది. కేబినెట్ లో కూడా యువరక్తానికే పెద్ద పీట వేయడంతో సీనియర్లకు ఇక సైకిల్ పార్టీలో కాలం చెల్లినట్లేనని అనుకోవాల్సిందే.
Next Story