Fri Dec 05 2025 14:04:49 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : చేయి దాటక ముందే చంద్రబాబు మేల్కొనాలా? లేకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదా?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చే నెలతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి ఏడాది కావస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చే నెలతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి ఏడాది కావస్తుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అనేక హామీలు పెండింగ్ లో ఉన్నప్పటికీ నిధుల కొరత కారణంగానే అమలు చేయలేకపోతున్నామని చంద్రబాబు ప్రజలకు చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ప్రజలు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి బయటపడాలంటే ఇచ్చిన హామీల కోసం మరికొంత కాలం వెయిట్ చేయాల్సి ఉంటుందని మానసికంగా సిద్ధమయ్యారు. చంద్రబాబు ప్రజలకు పదే పదే చెబుతూ వారిని హామీల విషయంలో పెద్దగా వ్యతిరేకత రాకుండా చూసుకోగలిగారు.
భారీగా వస్తుండటంతో...
అయితే ఒకే ఒక విషయంలో మాత్రం చంద్రబాబు చేయి దాటి పోయిందనే చెప్పాలి. అదే విద్యుత్తు బిల్లులు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు బిల్లులు భారీగా వస్తున్నాయి. గతంలో రెండు వందల రూపాయలు వచ్చిన బిల్లు నేడు ఎనిమిది వందల రూపాయలకు చేరుకోవడంతో సామాన్యుల నుంచి వ్యాపారుల వరకూ విద్యుత్తు బిల్లుల విషయంలో మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే ట్రూ అప్ ఛార్జీలను విధించాల్సి వచ్చిందని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటకీ ప్రజల చెవుల్లోకి ఎక్కడం లేదు. ప్రతి నెలా విద్యుత్తు బిల్లులు అధిక మొత్తంలో చెల్లించాల్సి రావడంతో కూటమి ప్రభుత్వం పై కొందరు బహిరంగంగానే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ట్రూ అప్ ఛార్జీలతో పాటు...
కేవలం ట్రూ అప్ ఛార్జీలు మాత్రమే కాదు అనేక ఛార్జీలు వేయడంతో తాము వినియోగించిన విద్యుత్తు కొంతఅయినా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఇటీవల ఒక సర్వే సంస్థ గ్రామీణ, అర్బన్ ఏరియాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించినప్పుడు విద్యుత్తు సమస్యలపైనే ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక కామెంట్స్ చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇక చిరు వ్యాపారులు కూడా తమకు వచ్చే రోజు వారి ఆదాయం కంటే నెలవారీ వచ్చే విద్యుత్తు బిల్లులే అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలను పెంచబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల విషయంలో మేలుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు మాత్రం బాగానే అందుతున్నాయి.
Next Story

