Wed Jul 16 2025 23:46:47 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : చంద్రబాబు రాజకీయం అట్లుంటది జగనూ.. కుడి, ఎడమ చేతులకు సంకెళ్లేగా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీని కూటమ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు కనపడుతుంది

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీని కూటమ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు కనపడుతుంది. జగన్ అధికారంలో ఉండగా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు రాజకీయ తెలిసిన వ్యక్తి. అందుకే సామాజికవర్గాన్ని టార్గెట్ చేసినట్లు కనిపించకుండా అదే వర్గం వారిని అరెస్ట్ చేయకుండా అన్ని సామాజికవర్గాలను అరెస్ట్ చేస్తూ వారిపై కేసులు నమోదు చేస్తూ మరొకకొత్త విధానానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. దీంతో పాటు జగన్ కు కుడి, ఎడమ భుజాలుగా ఉన్నవారిని కూడా అదుపులోకి తీసుకుని కేసుల్లో ఇరికించి జైలుకు పంపితే జగన్ ఒంటరి వాడు అవుతాడన్న అంచనాలు కావచ్చు.
ముద్ర పడకుండా...
చంద్రబాబు రాజకీయం అలాగే ఉంటుంది. ముందు నందిగం సురేశ్ జైలుకు వెళ్లారు. హత్య కేసులో ఆయన జైలు ఊచలు లెక్కపెట్టి వచ్చారు. తర్వాత పోసాని కృష్ణమురళిపై కేసు మీద కేసులు పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రౌండ్ వేశారు. జైల్లో కొన్నాళ్లున్న పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు బెయిల్ తో బతుకు జీవుడా అని బయటపడ్డారు. ఇక వల్లభనేని వంశీ మూడు నెలల నుంచి విజయవాడ జిల్లా జైలులోనే ఉన్నారు. వంశీపై వరస కేసులు నమోదవుతున్నాయి. అంటే చంద్రబాబు ఒకే సామాజికవర్గాన్ని టార్గెట్ చేశారన్న ముద్ర మాత్రం వేసుకోలేదు. ఇప్పుడు జగన్ కోటరీలో ఒక్కొక్కరు నేరుగా జైలులోకి వెళుతున్నారు. ఇక ఇంకా అనేక మంది లైన్ లో ఉన్నారని చెబుతున్నారు.
ఐదేళ్ల పాటు ఇబ్బంది పెట్టిన...
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో టీడీపీని ఇబ్బందిపాలు చేసింది జగన్ తో పాటు కోటరీ కూడా ప్రధాన కారణమని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. ఏపీ మద్యం స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఏడుగురిలో దాదాపు నలుగురు జగన్ కోటరీలో ఉన్నవారే. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ కు ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డిలు కూడా జగన్ కు నాడు రైట్ హ్యాండ్ గా వ్యవహరించారు. వీరిద్దరి అనుమతి లేనిదే జగన్ క్యాంప్ కార్యాలయంలోకి మంత్రులు కూడా కాలుమోపలేని పరిస్థితి నాడు. వీరే రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికతో పాటు అభివృద్ధి పనుల మంజూరులోనూ వీరే కీలకంగా మారారు. ఇప్పుడు కూడా వీరిద్దరూ జగన్ కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
క్యూలో వీరంతా...
ఇక వీరితో పాటు లైన్ లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులపై ఇప్పటికే అటవీ భూముల ఆక్రమణ కేసు నమోదయింది. రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి కూడా మద్యం స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. వీరితో పాటు నాడు ప్రభుత్వ సలహదారుగా, సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా క్యూలో ఉన్నారని చెబుతున్నారు. చిట్ట చివరకు జగన్ ను టార్గెట్ చేయనున్నారు. ఇలా జగన్ చుట్టూ ఉన్న కోటరీని ఇబ్బందులు పాలు చేసి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపగలిగితే మాత్రం జగన్ ను ఒకరకంగా దెబ్బకొట్టినట్లవుతుందన్న భావనలోనే ఈ ప్రభుత్వం ఉన్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్ధమవుతుంది.
Next Story