Mon Feb 09 2026 18:23:56 GMT+0530 (India Standard Time)
TDP : అఖిలప్రియ vs ఏవీ సుబ్బారెడ్డి.. నాయకత్వం జోక్యం చేసుకోదా?
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియకు, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి

ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియకు, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే భూమా నాగిరెడ్డికి చెందిన సన్నిహితులను దూరం చేసుకున్న అఖిలప్రియ సొంతంగా తన ఇమేజ్ ను బిల్డప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని ఏవీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. తన తండ్రికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి పై అఖిలప్రియ కక్ష కట్టినట్లు వ్యవహరించడంతో టీడీపీ శ్రేణులు కూడా ఒకరకంగా ఆందోళనకు లోనవుతున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య పొరపచ్చాలు తలెత్తాయి. తన తండ్రి బినామీ ఆస్తులను ఏవీ తమకు అప్పగించకుండా సొంతం చేసుకున్నారన్న అనుమానాలు అఖిలప్రియలో బలంగా కలిగాయి.
గోడ కూల్చివేతతో...
అప్పటి నుంచి ఏవీ సుబ్బారెడ్డి విషయంలో అఖిలప్రియతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఒకరకంగా దూరంగానే ఉంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు నుంచే వీరి మధ్య వైరం ఉంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయిన తర్వాత అఖిలప్రియ మరింత కక్ష సాధింపులకు దిగుతున్నారని ఏవీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 2024ఎన్నికలకు ముందు లోకేశ్ పాదయాత్ర సందర్భంగా తనపై దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తాజాగా ఏవీ సుబ్బారెడ్డి మున్సిపాలిటీ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించారంటూ మున్సిపల్ అధికారులను పురమాయించి ఆ గోడను కూలదోయించడంతో విభేదాలు మరింత రచ్చకెక్కాయి. ఇది ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
నాయకత్వానికి ఫిర్యాదు చేయాలని...
మున్సిపల్ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించినందున అధికారులు చర్యలు తీసుకున్నారని అఖిలప్రియ వర్గం చెబుతుంది. అయితే ఈ గోడ కూల్చిన సందర్భంగా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డితో పాటు ఆయన కుమార్తెలు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఏవీ సుబ్బారెడ్డి పార్టీ నాయకత్వాన్ని కలసి ఆళ్లగడ్డలో జరుగుతున్న విషయాలను చెప్పాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అఖిలప్రియ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమేమి? ఆరోపణలు వచ్చాయో నాయకత్వానికి వివరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారని తెలిసింది. అయితే అఖిలప్రియ మాత్రం ఏవీ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి కనిపించడం లేదు. దీంతో మరోసారి ఆళ్లగడ్డ టీడీపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి.
Next Story

