Wed Jul 16 2025 23:59:48 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏడాది అవుతున్నా ఎదుగుదల ఏదీ.. నేతల్లో ఆధిపత్య పోరు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీలో ఆధిపత్య పోరు ఎక్కువయింది

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధిపత్య పోరు ఎక్కువయింది. పార్టీ నేతల్లోనే ఒకరంటే ఒకరికి పడటం లేదు. ప్రధానంగా నియోజకవర్గాల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలకు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ తమకు ఆర్థికంగా అండదండలు లభించడం లేదన్న భావన ద్వితీయశ్రేణి నేతల్లో ఎక్కువగా ఉంది. లిక్కర్ వ్యాపారం, ఇసుక విధానం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చని భావించినప్పటికీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారు. కొన్ని చోట్ల ఈ వివాదాలు హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. ఒంగోలు తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు ఇందుకు ఉదాహరణ. తమ ఆదాయానికి గండి కొడుతున్నారని వీరయ్య చౌదరిని కిరాతకంగా సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు.
అనేక నియోజకవర్గాల్లో...
అలాగే గుంతకల్లు నియోజకవర్గంలోనూ ఆధిపత్య పోరుతోనే కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్యకు గురయ్యారంటున్నారు. ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు పవర్ లోకి వచ్చేసరికి అంతా తమ కనుసన్నల్లోనే నడవాలని భావిస్తున్నారు. పార్టీ నేతలు కూడా అందుకు అనుగుణంగా వారికి అవకాశాలు కల్పించారు. లిక్కర్ దుకాణాల వేలంలోనే ఎక్కువ మంది టీడీపీ నేతలు పాల్గొని వాటిని దక్కించుకున్నారన్న ఆరోపణలున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న బార్లను కూడా ఇంకా లైసెన్సు గడువు పూర్తి కాకపోవడంతో అనధికారికంగా అనేక ప్రాంతాల్లో వాటిని టీడీపీ నేతలు సొంతం చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఎక్సైజ్ అధికారుల చేత దాడులు చేయించడంతో పాటు తాము కూడా వార్నింగ్ లు ఇవ్వడంతో చాలా చోట్ల వైసీపీ నేతల చేతుల్లో ఉన్న బార్లు టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. నరసరరావు పేటలో ఆ మధ్య జరిగిన ఘర్షణలు బార్ ను సొంతం చేసుకోవడానికేనని బహిర్గతమయింది.
ఇసుక ర్యాంప్ ...
ఇక ఇసుక ఉచితం అని ప్రభుత్వం పాలసీ అని ప్రకటించినప్పటికీ ఒక్కొక్క ర్యాంపు ను టీడీపీ నేతలు సొంతం చేసుకుని తాము చెప్పిన ధరకే విక్రయించాలన్న డిమాండ్ పెట్టారని తెలిసింది. అయితే ఎమ్మెల్యేలతో సత్సంబంధాలున్న కొందరికే ఈ అవకాశం దక్కడంతో మిగిలిన నేతలు అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయానికి అనేక నియోజకవర్గాల నుంచి ఉచిత ఇసుక విషయంలో తమను ఎమ్మెల్యే మోసం చేస్తున్నారంటూ కొందరు ఫిర్యాదులు చేస్తుండటం విశేషం. ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు, అక్కడ టీడీపీ నేతలకు మధ్య గ్యాప్ పెరిగి అనేక వివాదాలకు కారణంగా మారాయన్నది బహిరంగ రహస్యమే.
అంతర్గత వార్...
టీడీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం నడుస్తుంది. ఒకరిపై ఒకరు కేంద్రానికి ఫిర్యాదులు చేసుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కుతున్నారు. ఇక కొందరు నేతలయితే నేరుగా నారా లోకేశ్ కు కూడా ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబు వరకూ వెళ్లలేని నేతలు మాత్రం లోకేశ్ ను కలసి తమ గోడును వినిపించుకుంటున్నారు. ఇక జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ తమకు ప్రాధాన్యత దక్కలేదంటూ కొందరు ఆరోపిస్తున్నారు. అందుకే ఇటు చంద్రబాబు, అటు లోకేశ్ లు ఇద్దరూ నియోజకవర్గాలకు పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ కార్యకర్తలతో సమావేశమై వారి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. పనులు కాకుంటే దశలవారీగా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయినప్పటికీ తమకు ఇంకా ప్రతిఫలం అందలేదని అసహనంతో క్యాడర్ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది.
Next Story