Tue Jul 15 2025 16:18:14 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పింఛన్లు పొందే వారిలో అనర్హులే ఎక్కువట.. ఏపీలో బయటపెడుతున్న సర్వే వాస్తవాలు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అందుకుంటున్న వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అందుకుంటున్న వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, కావాలని కొందరిని పథకాలకు ఎంపిక చేసి ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా పంచిపెట్టారన్న ఆరోపణలు అనేకం రావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అందులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు అధికారులతో తిరిగి సర్వేలను నిర్వహిస్తుంది. ప్రధానంగా నెలవారీ పింఛన్లను కూటమి ప్రభుత్వం పెంచడంతో ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడకుండా, అర్హులైన వారికి మాత్రమే పింఛను అందేలా చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
అర్హులలో ఏ ఒక్కరికీ...
అర్హులలో ఏ ఒక్కరూ పింఛను అందకుండా ఉండకూడదని, అలాగే అనర్హులెవరికీ పింఛన్లు కానీ ఇతర సంక్షేమ పథకాలను కూడా అందించడానికి వీలులేదని అధికారులకు చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా గత పది నెలల క్రితం ఏర్పాటయిన కూటమి ప్రభుత్వంలో ఆరు నెలల పరిపాలన తర్వాత స్పష్టమైన సంకేతాలను పంపారు. ఇంటింటికి తిరిగి సర్వే చేయాలని ఆదేశించారు. పింఛను ఏ ఒక్కరికీ అర్హత ఉన్నా రాకపోయినా ఊరుకోనని, అలాగే అనర్హులు ఏ ఒక్కరికి అందినా తాను క్షమించబోనని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు.
ఆరువేలు పొందుతున్న వారిలో...
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఆరు వేల రూపాయలు పింఛన్లు పొందుతున్న వారిలో భారీగా అనర్హులు ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో ఆరు వేల రూపాయాల చొప్పున దివ్యాంగ పింఛన్లు పొందుతున్న లబ్ధిదార్లలోనూ ప్రభుత్వం భారీగా అనర్హులను గుర్తించినట్లు సమాచారం. గతంలో పదిహేనువేలు నెలకు పింఛను పొందేవారిలోనూ అనర్హులను గుర్తించారు. పూర్తిగా మంచానికే పరిమితమయిన దివ్యాంగులకు నెలకు పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులోనూ భారీగా అవకతవకలన్నట్లు గుర్తించి వాటిని తొలగించింది.ఇదే మాదిరిగా నెలకు ఆరు వేల రూపాయలు తీసుకుంటున్న దివ్యాంగుల పింఛన్ల ను రూ పొందుతున్న వారిలో అనర్హులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పింఛన్ పొందుతున్న వారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది వరకూ ఉన్నారు. అందుతున్న సమాచారం మేరకు 3 లక్షల మంది దివ్యాంగులకు వైద్య పరీక్షలునిర్వహించగా 65 వేల మంది అనర్హులు ఉన్నారని తేలింది. దీంతో మిగిలిన వారిని కూడా పరీక్షించి అర్హులను గుర్తించి అనర్హులను ఏరివేయాలని నిర్ణయించారు.
Next Story